బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 01:33:11

నేరరహిత తెలంగాణే లక్ష్యం

నేరరహిత తెలంగాణే లక్ష్యం

  • రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి లేదు  
  • డీజీపీ మహేందర్‌రెడ్డి 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ/జ్యోతినగర్‌: నేర రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలుపడమే లక్ష్యంగా ముందు కు వెళ్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. శాంతిభద్రతలను నెలకొల్ప డం.. వేగంగా నేర నిర్ధారణ.. నేరస్తులకు శిక్షలు పడేలా చూడటంలో ప్రణాళికాబద్ధం గా పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మంగళవారం పెద్దపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పర్యటించిన డీజీపీ అనంతరం వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాలయం(నిట్‌)లో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో శాంతిభద్రతలు నెలకొల్పడమే కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో పోలీసు శాఖ భాగస్వామ్యం అవుతుందన్నారు. 


సీఎం కేసీఆర్‌ పోలీసు శాఖపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.  రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల విస్తరణ జరగకుండా ఉండేందుకు వీలుగా అన్నిచర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నేరరహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో 10 లక్షల సీసీ కెమెరాలను అమర్చుతున్నట్టు వెల్లడించారు. సమీక్షలో వరంగల్‌ రేంజ్‌ ఐజీ వై నాగిరెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, రామగుండం సీపీలు డాక్టర్‌ రవీందర్‌, కమలాసన్‌రెడ్డి, సత్యనారాయణ, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ పాల్గొన్నారు.


logo