OU JAC | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం సమస్యలపై చొరవ చూపించాలని కోరారు. వివిధ సమస్యలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. 2018 పీహెచ్డీ పరిశోధక విద్యార్థులు థీసిస్ సబ్మిషన్ గడువు పొడిగించాలని కోరారు. 2017 పీహెచ్డీ స్కాలర్స్ థీసిస్ సబ్మిషన్కి వన్ టైమ్ ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నూతన పీహెచ్డీ నోటిఫికేషన్ లో సీట్ల సంఖ్య పెంచాలని అన్నారు. యూనివర్శిటీలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓయూలో ఉద్యమాలను నిషేధిస్తూ ఇచ్చిన సర్క్యులర్‌ను బేషరతుగా వాపస్ తీసుకోవాలని హితవు పలికారు. వీటిపై గత కొన్ని రోజులుగా విద్యార్థులు విన్నవిస్తుంటే యూనివర్సిటీ యంత్రాంగం ఏమి పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని అడిగిన దివ్యాంగ విద్యార్థులపై కేసులు నమోదు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన ప్రభుత్వం, యూనివర్సిటీ యంత్రాంగం దానికి విరుద్ధంగా నియంతృత్వ విధానాల అమలకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. దానిలో భాగంగానే రాజ్యాంగ విరుద్ధంగా, విద్యార్థుల హక్కులు కాలరాసే విధంగా సర్క్యులర్ విడుదల చేసారని మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు విధించినా ఉస్మానియా విద్యార్థి లోకం మడమ తిప్పదని, బరిగీసి పోరాడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఉస్మానియా యూనివర్సిటీకి రూ. వెయ్యి కోట్లు కావాలని విద్యార్థులు, ఆచార్యులు ప్రభుత్వాన్ని కోరుతుంటే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాత్రం పదవి కాపాడుకోవడానికి తక్కువ కేటాయింపులకు కూడా భజన చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే విద్యార్థులు కోరుతున్న అంశాలకు పరిష్కారాలు చూపాలని, అప్రజాస్వామిక సర్క్యులర్ ను రద్దు చేసి ఓయూ ప్రతిష్ఠను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో
ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు ఎస్ నాగేశ్వర రావు, ఎన్.సుమంత్ (జార్జిరెడ్డి పీడీఎస్‌యూ), కొమ్ము శేఖర్ (ఎంఎస్ఎఫ్), జంగిలి దర్శన్ (డీబీఎస్ఏ), వలిగొండ నరసింహ (టీపీ జేఏసీ), వేదాంత మౌర్య (ఎస్ఎస్ఏ), చేరాల వంశీ, (జెఎస్ఏ), ఎస్.అంజి (జార్జిరెడ్డి పీడీఎస్‌యూ) తదితరులు పాల్గొన్నారు.