హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, కవి, రచయిత డాక్టర్ గిన్నారపు ఆదినారాయణకు భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారం-2025 లభించింది. భాషా పరిశోధన, సాహిత్యరంగాలపై చేసిన కృషికి కోల్కతాలోని భారతీయ భాషా పరిషత్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆదినారాయణను తెలుగు యూనివర్సిటీ పూర్వపు వీసీ ఆచార్య ఎన్ గోపి, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, హెచ్సీయూ తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ పిల్లల రాములు, పూర్వపు అధ్యక్షుడు దార్ల వెంకటేశ్వర్రావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తదితరులు అభినందించారు.
బీసీ గురుకులంలో డిగ్రీ కోర్సుకు దరఖాస్తులు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2025లో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు(ఇంగ్లిష్ మీడియం) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదటి సంవత్సరం బీఎస్సీ(ఫిజికల్ అండ్ లైఫ్ సైన్సెస్), బీకాం, బీఏ, బీబీఏ, బీఎఫ్టీ, యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. అర్హులైన విద్యార్థులు mjptbcwreis. telangana.gov.in లేదా tgrdccet.cgg.gov.in/TGRDCWEB/లో ఈ నెల 16 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.