హుజూర్నగర్ రూరల్, జూలై 12 : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై సర్కార్ అక్రమ కేసులు పెడుతూ పోలీసులతో పరిపాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, హుజూర్నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నర్సింహారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల పరిధిలోని గోపాలపురంలో మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ వైఫల్యాలను, బూటకపు హామీలను ప్రశ్నిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, వెంటనే ఆ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి సమన్యాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నేడు రేవంత్‌రెడ్డి పాలనలో ఏకపక్ష నిర్ణయాలు, అప్రజాస్వామిక పాలన కొనసాగుతున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజలంతా కాంగ్రెస్ పాలనపై విసుగుచెందారని, బీఆర్ఎస్ను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా వానకాలం పంట సాగుకు నీటి విడుదలపై ఇంకా స్పష్టత లేకపోవడం విచారకరమని అన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నందున ఎన్ఎస్పీ కాలువలకు నీళ్లు ఎప్పుడు వదులుతారో రైతులకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.