హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగాలను కల్పించడం ద్వారా స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ)ని పెంపొందించుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగాల్లో జీఎస్డీపీ పెంపునకు అవసరమైన వ్యూహాల రూపకల్పనపై బుధవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గత ఎనిమిదేండ్లలో రాష్ట్రం రూ.7.57 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, వీటి ద్వారా 3.14 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ అండ్ ఐటీఈఎస్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆటోమొబైల్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ, మైనింగ్, లాజిస్టిక్స్ రంగాలను ప్రభుత్వం ప్రాధాన్య రంగాలుగా గుర్తించిందన్నారు.