హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తు చేయడం పై సందిగ్ధత నెలకొన్నది. ఇంటర్‌బోర్డు ఇంకా హాల్‌టికెట్లను విడుదల చేయకపోవడం, హాల్‌టికెట్ నంబర్ ఉంటేనే ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసే వీలుండటం సమస్యగా మారింది. జేఎన్టీయూ ఈ నెల 20న టీజీ ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేసిం ది. ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది.
ఇంటర్ హాల్‌టికెట్లను శుక్రవారమే విడుదల చేస్తామన్న ఇంటర్‌బోర్డు ఆదివారం వరకు కూడా విడుదల కాలేదు. ఎప్‌సెట్ సహా పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో స్థానికత, స్థానికేతర కోటాపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. కొత్త విధానాన్ని ఖరారు చేసేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ 95:5 కోటాను ప్రతిపాదించింది. అంతేకాకుండా అధికారులు మరో ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. ఏ కోర్సులో అడ్మిషన్ పొందుతున్నారో అంతకుముందు ఏడేండ్లల్లో నాలుగేండ్లపాటు తెలంగాణలో చదివితే స్థానికులుగా ఖరారు చేశారు. ఈ సిఫారసులకు ఆమోదం తెలుపుతూ సర్కా రు జీవో జారీచేయాల్సి ఉంది. కానీ ఇంత వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.