హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కాళేళ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ సీపీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతున్నది. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో ఆరుగురు రిటైర్డ్ ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి బ్యాంకు గ్యారెంటీని ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఈఈ విడుదల చేశారని, 2019లోనే బ్యారేజీల్లో సీపేజీలను గుర్తించామంటూ కొందరు ఇంజినీర్లు కమిషన్ ఎదుట తెలిపారు. ఐదుగురు ఇంజినీర్లను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.
అఫిడవిట్లలో పేరొన్న సమాచారం ఆధారంగా జస్టిస్ ఘోష్ పలు ప్రశ్నలను సంధించారు. బ్యాంకు గ్యారెంటీ విషయమై ఈఎన్సీ కార్యాలయ డిప్యూటీ సీఈ మహ్మద్ అజ్మల్‌ను విచారించారు. బరాజ్‌ల డిజైన్లను ఎవరు ఆమోదించారు.. వంటి ప్రశ్నలకు ఈఈ విష్ణుప్రసాద్ నుంచి సమాధానాలు రాబట్టారు. రామగుండం డిప్యూటీ ఎస్ఈ సత్యనారాయణగౌడ్, రిటైర్డ్ ఎస్ఈలు కరుణాకర్, సత్తిరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఎస్ఈ ఓంకార్‌సింగ్ హాజరుకాలేదు. బుధవారం గజ్వేల్ ఈఎన్సీ హరీరాం, డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంటెంట్ ఫణిభూషణ్, నీటిపారుదల శాఖ ముఖ్య అకౌంట్స్ అధికారి పద్మావతిని కమిషన్ విచారించనున్నది.
నేడు, రేపు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించే చాన్స్
హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు అధికారులు మరో అవకాశమిచ్చారు. బుధ, గురువారాల్లో తాత్కాల్ కింద ఫీజు చెల్లించేందుకు అవకాశమిచ్చినట్టు డైరెక్టర్ సీవీ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. పదోతరగతి వారు రూ.500, ఇంటర్మీడియట్ వారు రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అక్టోబర్ 3 నుంచి 9వరకు వార్షిక పరీక్షలను నిర్వహించనుండగా, ఈనెల 30న హాల్‌టికెట్లు విడుదల చేస్తామని తెలిపారు.
వాయుగుండాలతోనే విపత్తు
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏటూరునాగారంలోని తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఇటీవల పర్యావరణ విపత్తు సంభవించి, 50 వేల చెట్లు నేలకొరగడం వెనుక మిస్టరీ వీడుతున్నది. బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రాల్లో ఒకేసారి వాయుగుండాలు ఏర్పడి, బలమైన గాలులు వీయడం వల్లే ఈ విపత్తు సంభవించి ఉండవచ్చని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మంగళవారం హైదరాబాద్ అరణ్యభవన్‌లో ప్రధాన అటవీ సంరక్షణాధికారి డోబ్రియాల్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు. తాడ్వాయిలో సంభవించిన నష్టాన్ని ములుగు డీఎఫ్‌వో కిషన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్ఆర్ఎస్సీ, ఎన్‌ఏఆర్ లేబొరేటరీ, పీసీసీఎఫ్, వాతావరణ శాఖల అధికారులు ఉన్నారు.