Painkiller Tablet | పహాడి షరీఫ్, ఏప్రిల్ 21: మత్తు పదార్థాలకు బానిసలవుతూ కొందరు యువకులు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మత్తు కోసం అతిగా పెయిన్‌కిల్లర్ తీసుకోవడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతున్న సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం.. సుల్తాన్‌పూర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్నాసర్ (17) ఎంఎస్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన షాబాజ్ (22), మరో 17ఏండ్ల మైనర్ యువకుడు ఇద్దరు నాసర్‌కు స్నేహితులు. ఇటీవల ఈ ముగ్గురు మత్తుమందులకు అలవాటుపడ్డారు.
షాహీన్‌నగర్‌కు చెందిన సాహిల్ (22) ఓ మెడికల్ దుకాణం నుంచి భారీగా పెయిన్‌కిల్లర్ ట్యాబ్లెట్లు హోల్‌సెల్ ధరలకు కొనుగోలుచేసి వాటిని యువకులకు అధిక ధరకు విక్రయిస్తున్నాడు. ఈక్రమంలోనే సాహిల్ టైడాల్ (పెయిన్‌కిల్లర్) ట్యాబ్లెట్లను ఈనెల 17న లిక్విడ్ రూపంలో ఈ ముగ్గురు యువకులకు ఇంజెక్షన్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత నాసర్‌తోపాటు షాబాజ్, మరో యువకుడు అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వెంటనే సాహిల్ విషయాన్ని వారి కుటుంబసభ్యులకు తెలిపి.. స్థానిక దవాఖానకు తరలించాడు. నాసర్ పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ నాసర్ 19న మృతిచెందాడు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికతో మత్తుపదార్థాల డోస్ ఎక్కువతోనే మృతి చెందినట్టు గుర్తించిన పోలీసులు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో సోమవారం మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వడదెబ్బతో ఏడుగురి మృతి
ఎండలు మండిపోతుండటంతో వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. నిర్మల్ పట్టణంలోని కురన్నపేట్ కాలనీకి చెందిన నిగులపు శంకర్ (48), నిగులపు రాజు (42), ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్కు చెందిన చౌహన్ కేశవ్ (60) వడదెబ్బతో మరణించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలోని కొనుగోలు కేంద్రంలో రైతు ప్రేమలత (58), వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో గీసగోని శ్రీదేవి (36), కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లిలో ఉడిగె ఐలమ్మ (54), నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో లావుడ్య లక్ష్మి(55) వడదెబ్బ బారినపడి మృతిచెందారు.