హైదరాబాద్ : తాను తీసుకున్న ఒక్క నిర్ణయం లక్ష మంది నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో మేలు చేసిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలో యూఎల్సీ,రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించిన సందర్భంగా ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన సభ్యులు ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సమావేశంలో ఎమ్మెల్యేను సన్మానించారు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి మారడం వల్ల నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యాయని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికోసమే పార్టీ మారినట్లు మరోసారి స్పష్టం చేశారు. కొందరు అధికారులు చేసిన తప్పిదం వల్ల ఎల్బీనగర్ నియోజకవర్గంలో యూఎల్సీ, రిజిస్ట్రేషన్ల సమస్యలు తలెత్తాయని తెలిపారు.
సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్‌పై ప్రత్యే దృష్టి సారించి యూఎల్సీ, రిజిస్ట్రేషన్ల సమస్యకు పరిష్కారం చూపారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన జీవో నంబర్ 118 లో కొన్ని సవరణలు అనంతరం వచ్చే కొత్త జీవో విడుదల కాగానే తమ స్థలాలకు గజానికి రూ. 250 చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవాలని సూచించారు. జీవో వల్ల ఎల్లీనగర్ నియోజకవర్గంలోని 46 కాలనీల ప్రజలకు యూఎల్సీ, రిజిస్ట్రేషన్ల సమస్య నుంచి విముక్తి లభించిందని తెలిపారు.