హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పోలీసుశాఖలో మరోసారి పదోన్నతులకు రంగం సిద్ధమైంది. ఈసారి 78 మంది డీఎస్పీ స్థాయి(సివిల్) అధికారులకు అడిషనల్ ఎస్పీ(నాన్‌కేడర్)లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 78 మంది అర్హులైన డీఎస్పీల లిస్టును ఏసీబీ క్లియరెన్స్ కోసం డీజీ సీవీ ఆనంద్‌కు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) పంపినట్టు తెలిసింది. అర్హులైన డీఎస్పీలకు పదోన్నతులు కల్పించాలని అన్ని కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసులకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. ఇదే విషయాన్ని మల్టీజోన్ ఐజీలకు, ట్రైనింగ్ డైరెక్టర్‌కు ఫ్యాక్స్ ద్వారా తెలియజేసింది. లిస్టులో జతచేసిన అధికారుల ట్రాక్ రికార్డులు, క్రిమినల్ చర్యలను దృష్టిలో పెట్టుకొని పదోన్నతులపై తుది జాబితాను డీజీపీ కార్యాయాలనికి ఏసీబీ అధికారులు అందజేయనున్నారు.