హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద 31 మంది అంబుడ్స్పర్సన్లను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించేందుకు రాష్ట్ర సర్కారు ఏడాది తర్వాత అనుమతి ఇచ్చింది. గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఆధీనంలో పనిచేసేందుకు అంబుడ్స్‌మెన్‌లను 2025 మార్చి 31 వరకు, లేదా అవసరం ఉన్నంతవరకు, ఏది ముందైతే అది వర్తించేలా తీసుకోవాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా 2025 జూలై 22న ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నియామకాల కోసం కొత్త కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకోవాలని, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆ ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా 31 జిల్లాలకు ఒక్కొక్కరు చొప్పున 31 మందిని తీసుకొని నెలకు రూ.33,000 చొప్పున వేతనం చెల్లించాలని, ఎస్ఎన్ఏ ఖాతా నుంచి చెల్లించాలని ఆదేశించారు. అయితే, గతంలో 32 జిల్లాల్లో పనిచేసిన అంబుడ్స్మెన్ల పదవీకాలం 2024 జూలైతోనే ముగిసింది.
పాతవారిని రెన్యువల్ చేయకుండా, సరిగ్గా ఏడాది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇవ్వడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఉపాధి హామీ పనులపై ఫిర్యాదులు, విచారణ కోసం అంబుడ్స్‌మెన్ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2021లో అంబుడ్స్పర్సన్లను తీసుకోగా 2024 వరకు వారి పదవీకాలాన్ని పొడిగించుకుంటూ వచ్చారు. 2024 జూలైతో వీరి పదవీకాలం ముగిసింది. నాటి నుంచి వీరిని కొనసాగిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వు జారీకాలేదు. కానీ, పదవీకాలం ముగిసినా చాలామంది అంబుడ్స్పర్సన్లు కార్యాలయాలకు వచ్చి వెళ్తున్నారు. కొన్ని జిల్లాల్లో వారిని రావద్దంటూ డీఆర్డీవోలు ఆదేశాలు ఇచ్చారు.
ఇంతకీ పాత అంబుడ్స్పర్సన్ల సేవలు కొనసాగిస్తారా? వారి స్థానంలో మొత్తం కొత్తవారిని తీసుకుంటారా? అనే విషయాన్ని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొనలేదు. కానీ, కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ (సీఆర్డీ) పర్యవేక్షణలో పనిచేయాలని సూచించారు. 2024 జూలై నుంచి పాత అంబుడ్స్పర్సన్ల కాంట్రాక్టును రెన్యువల్ చేయకుండా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి పనిచేయని వారికి పేమెంట్ విడుదల చేయాలని చెప్తున్నారా? ఈ జీవో ఉద్దేశం 50-50 కమీషన్ కోసమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2024 ఏప్రిల్ ఒకటి నుంచి 2025 మార్చి ఒకటి వరకు అంబుడ్స్మెన్ల పనితీరు (ఫర్ఫార్మెన్స్ అప్రైజల్)పై నివేదికను అందించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్.. 2024 జూలైలోనే జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు. అంబుడ్స్‌మెన్‌లను కొనసాగించకుండా వారి పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం చోద్యంగా ఉన్నదని నాడు విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పుడు పార్లమెంటరీ స్టడీకమిటీ పర్యటన రాష్ట్రంలో ఉండటంతో ముందు వారి తప్పు(రెన్యూవల్/రిక్రూట్మెంట్ వైఫల్యం)ను కప్పిపుచ్చుకోవడానికే ఫర్ఫార్మెన్స్ అప్రైజల్ నివేదిక కోరినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంపై డైరెక్టర్‌ను వివరణ కోసం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా, అందుబాటులోకి రాలేదు.