KCR Kit | హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): మాతాశిశు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ‘కేసీఆర్ కిట్’ పథకం రూపురేఖలు మార్చాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది. ఇప్పటికే ‘కేసీఆర్ కిట్’ అనే పేరును తొలగించి తాత్కాలికంగా ‘మదర్ అండ్ చైల్డ్ హెల్త్’ (ఎంసీహెచ్) కిట్ పేరుతో అమలు చేస్తున్నది. భవిష్యత్తులో ఈ పథకాన్ని ఎలా కొనసాగించాలనే అం శంపై మల్లగుల్లాలు పడుతున్నది. ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వహించిన సమీక్షలోనూ ఈ అంశంపై ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. ఈ పథకం సొంతంగా నిర్వహించాలా? లేక కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై)తో కలిపి కొనసాగించాలా? అనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, జూన్ 4 తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని అధికారులకు మంత్రి సూచించినట్టు సమాచారం.
మాతాశిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గర్భిణులకు రూ.15 వేల వరకు ఆర్థిక సాయం అందించింది. ఇందులో ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేల నగదు అందించింది. దీంతోపాటు తల్లీబిడ్డకు అవసరమయ్యే వస్తువులతో కూడిన రూ.2 వేల విలువైన కిట్‌ను కూడా అందజేసింది. గత సంవత్సరం చివరినాటికి దాదాపు 14 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని, దీనికోసం సుమారు 1,300 కోట్లు ఖర్చు చేసిందని వైద్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ పథకంతో ప్రతి గర్భిణి వివరాలు నమోదవడంతో వంద శాతం దవాఖాన ప్రసవాలు సాధ్యమయ్యాయి. ఫలితంగా మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
కేంద్ర ప్రభుత్వం పీఎంఎంవీవై పథకం కింద గర్భిణులకు మూడు విడతల్లో రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కిట్ పథకాన్ని పీఎంఎంవీవైతో కలిపి అమలుచేయాలని ఆరోగ్యశాఖ భావిస్తున్నది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని లెక్కలేస్తున్నా రు. అయితే, కేంద్రం నుంచి నిధులు తీసుకుంటే కచ్చితంగా వారి నియమ నిబంధనలకు అనుగుణంగా పత్రాల్లో, ప్రచారంలో కేంద్రం పేరును, లోగోను వాడాల్సి ఉం టుందని, సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖ సహకారంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పాల్సి వస్తుందని అధికారులు స్పష్టంచేస్తున్నారు. కిట్ పేరును సొంతంగా పెట్టుకోవడంపై కూడా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఇంత చేసినా కేంద్రం ఎప్పటికప్పుడు వెంటనే నిధులు విడుదల చేయదని, మూడు నెలలకు ఒకసారి కేటాయింపులు ఉంటాయని చెప్తున్నారు. తల్లీ బిడ్డకు అవసరమయ్యే వస్తువులతో అందించే రూ.2 వేల విలువైన కిట్‌ను కొనసాగించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. దీంతో కేంద్రంతో కలిసి వెళ్తే కలిగే లాభనష్టాలపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది.