హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తహసీల్దార్లను, నాయబ్ తహసీల్దార్లను తిరిగి పూర్వపు స్థానాలకు బదిలీ చేయాలని రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌కు ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు వారు గురువారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సొంత జిల్లాలో పనిచేస్తున్న, మూడేండ్లు మించి ఒకే జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లను, నాయబ్ తహసీల్దార్లను, ఇతర కార్యాలయాల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న తహసీల్దార్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని గుర్తుచేశారు. వారంతా కొన్ని నెలలుగా కుటుంబాలకు దూరంగా ఉంటూ విజయవంతంగా ఎన్నికల విధులు నిర్వహించారని తెలిపారు. గతంలో కూడా సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఉద్యోగులను యథాస్థానాలకు బదిలీ చేసే అనవాయితీ ఉన్నదని గుర్తుచేశారు.