రవీంద్రభారతి, జనవరి 7: హన్మకొండలో ఈనెల 11న లక్ష మందితో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఓసీల సింహగర్జన సమరభేరి సభను విజయవంతం చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి కటంగూరి రాంరెడ్డి పిలుపు ఇచ్చారు. బుధవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ.. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఏండ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ లబ్ధి కొసం జరుగుతున్న అసత్య ప్రచారాలు, కుట్రలను సహించబోమని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట స్థాయిలో చట్టబద్ధత కలిగిన ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసీ విద్యార్థులు టెట్ అర్హత మార్కులను 90 నుంచి 70కి తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయో పరిమితి పెంచాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను ఎలాంటి షరతులు లేకుండా ఐదేండ్ల కాలపరిమితితో జారీ చేయాలని కోరారు. సభకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఏపీ మంత్రి భరత్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని తెలిపారు.