Nursing Transfers | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) విభాగంలో నర్సింగ్ బదిలీల ప్రక్రియ రసాభాసగా మారింది. కౌన్సెలింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ వందల మంది నర్సులు శుక్రవారం రాత్రి కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు రాస్తారోకో నిర్వహించారు. డీపీహెచ్ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే నిరసన తెలిపారు. ‘హెల్త్ మినిస్టర్ రావాలి’.. ‘మాకు న్యాయం చేయాలి’ అంటూ నినాదాలు చేశారు. లాంగ్ స్టాండింగ్ జాబితా నుంచి పలువురి పేర్లు మాయమయ్యాయని, అర్హత లేని, బయటి సంఘాల నుంచి వచ్చిన సిఫారసు లేఖలను తీసుకొని కొందరిని రిటెయిన్ చేశారని, ఒక్కో బదిలీకి రూ. లక్షల్లో డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. రాత్రి వరకు నర్సుల ఆందోళన కొనసాగింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నర్సులకు సర్దిచెప్పేందుకు డీపీహెచ్ రవీంద్రనాయక్ మెడికల్ కాలేజీకి రాగా.. నర్సులు ఆయనను ఘెరావ్ చేసి నిలదీశారు. తమకు న్యాయం చేసేవరకు కౌన్సెలింగ్ నిర్వహించొద్దంటూ వాదించారు.
డీపీహెచ్ పరిధిలో స్టాఫ్ నర్సుల బదిలీల కోసం ఉస్మానియా మెడికల్ కాలేజీలో శుక్రవారం కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. సీనియ ర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్లు రెండు వేల మంది వరకు వచ్చారు. సీనియార్టీ లిస్టును ముందుగానే ప్రకటించాల్సి ఉండగా, గురువారం రాత్రి ప్రకటించారు. దీంతో శుక్రవారం కౌన్సెలింగ్‌కు వచ్చిన తర్వాత తప్పులు ఉన్నట్టు నర్సులు గుర్తించారు. వాటిని సవరించిన తర్వాతే కౌన్సెలింగ్ చేయాలంటూ ఆందోళన ప్రారంభించారు. దీంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తామని, ఆన్లైన్లో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చారు.
లాంగ్ స్టాండింగ్ జాబితా నుంచి 40 మంది స్టాఫ్ నర్సుల పేర్లు మాయమయ్యాయని నర్సులు పేర్కొన్నారు. కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలోనే.. సంఘాల నాయకులమని చెప్పుకొనే ఇద్దరు ముగ్గురు లీడర్లు వచ్చి, పదుల సంఖ్య లో లేఖలు అధికారులకు ఇచ్చి, అందరినీ రిటెయిన్ చేయాలని సూచించారని తెలిపారు. సిఫారసు లేఖల్లో ఉన్న పేర్లన్నీ ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, మెటర్నిటీలో పనిచేస్తున్నవారే ఉన్న ట్టు తెలిసింది. వీరంతా దశాబ్దాలుగా అక్కడే పాతుకుపోయారని ఆరోపణలున్నాయి. లీడర్లు ఆ లేఖలకు డబ్బులు వసూలు చేశారని, వైద్యారోగ్య శాఖలోని ఓ కీలక అధికారికి భారీగా ముట్టజెప్పి లిస్టులో నుంచి తమ పేర్లను తీసేయించుకున్నారని ఆరోపించారు. లిస్ట్ నుంచి పేర్లు మాయం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన ప్రారంభించారు.
ఆందోళనలను శాంతింపజేయడానికి డీపీహెచ్ రవీంద్ర నాయక్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి వచ్చారు. ఆయన నర్సులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అందరూ ఆయనను చుట్టుముట్టారు. కౌన్సెలింగ్ ఆపాలని, సీనియార్టీ లిస్టు, వేకెన్సీ లిస్టు ప్రకటించాలని, పారదర్శకంగా నర్సుల బదిలీలు జరిగేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక డీపీహెచ్ తిరిగి వెళ్లిపోయారు.
కౌన్సెలింగ్ నిర్వహిస్తామంటూ పొద్దంతా కాలయాపన చేసిన అధికారులు.. చీకటిపడే సమయంలో ‘కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తు న్నాం’ అంటూ ప్రకటించారు. దీంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ముందు కోఠి ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఆప్షన్లు ఇవ్వకుండా, ఆన్లైన్ కౌన్సెలిం గ్ నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యోగుల సాధారణ బదిలీలను ప్రకటించినప్పటి నుంచీ డీపీహెచ్ పరిధిలో సీనియార్టీ జాబితాపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. నర్సుల ఆందోళనతో మూడుసార్లు జాబితాను సవరించారు.