హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఎన్నారై ఆస్ట్రేలియా బీఆర్ఎస్ నేత అనిల్ బైరెడ్డి ఆధ్వర్యంలో మెల్బోర్న్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు ఆస్ట్రేలియా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేస్తున్నట్టు అనిల్ బైరెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ఇతర నగరాల్లో సైతం వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తామని వెల్లడించారు. 12 ఏండ్లుగా పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణలో బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా, కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతామని స్పష్టంచేశారు.