Meenakshi Natarajan | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంచ గచ్చిబౌలి వీడియోలన్నీ ఫేక్ అని చెప్పలేమని, వాస్తవ దృశ్యాలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చెట్లు, నెమళ్లు, జింకలు ఉన్నాయని తెలిసినా, అంత దూకుడుగా ఎందుకు వ్యవహరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మందలించినట్టు తెలిసింది. మహిళా విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు, యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది జింకను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలను ఏఐ సృష్టించిన వీడియోలంటే ఎవరైనా నమ్ముతారా? అని నిలదీసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సోషల్ మీడియాలో కృత్రిమ వీడియోలు కూడా ఉన్నాయని, కానీ వాటికి అవకాశం ఇచ్చిందెవరు? అని ప్రశ్నించినట్టు తెలిసింది.
శనివారం హెచ్‌సీయూపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ, ఎన్ఎస్యూఐ విద్యార్థులతో చర్చించిన అనంతరం ఆమె సీఎంతో మాట్లాడినట్టు తెలిసింది. సాధారణ పౌరులతో వ్యవహరించినట్టుగా విద్యార్థులతో వ్యవహరించారని, వారిపై లాఠీచార్జి వరకు ఎందుకు వెళ్లారని నిలదీసినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. హెచ్‌సీయూ అంశాన్ని కేవలం స్థానిక వివాదంగా చూడవద్దని, ఇది దేశ రాజకీయాలతో ముడిపడిన అంశమని పేర్కొన్నట్టు తెలిసింది. సెంట్రల్ వర్సిటీతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం, చాలామంది విద్యార్థులు, అధ్యాపకులు కాంగ్రెస్ వైపు నిలిచిన విషయాన్ని ఎలా మరిచిపోయారని గట్టిగానే మందలించినట్టు సమాచారం. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, అడ్డగోలు లీకులు, వదంతులతో సమస్యను ఇంకా జఠిలం చేసుకోవద్దని హితవు పలికినట్టు గాంధీభవన్ వర్గాలు అనుకుంటున్నాయి. ‘మీరు వేసే ప్రతి తప్పటడుగు జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపెడుతుంది. యూనివర్సిటీ భూములపై ఇక వెనక్కి తగ్గండి’ అని సలహా ఇచ్చినట్టు తెలిసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయ పోరాటం చేసి భూమిని దక్కించుకున్నామని, టీజీఐఐసీకి బదలాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకొందని, తర్వాత పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపట్టారని సీఎం ఆమెకు వివరించినట్టు తెలిసింది. 30- 40 ఏండ్లుగా భూమి వినియోగంలో లేకపోవడంతోనే అకడ చెట్లు పెరిగి పెద్దవయ్యాయని, అది అటవీ ప్రాంతం కానేకాదని సీఎం సర్దిచెప్పేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. అంతకుముందు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా అదే క్యాసెట్‌ను వినిపించినట్టు తెలిసింది. మీనాక్షి స్పందిస్తూ… ‘మీరు చెప్పినవి నిజమే కావచ్చు. కానీ, అటవీ జంతువులు ఉన్నప్పుడు రాత్రికిరాత్రి ఎందుకు బుల్డోజర్లు పంపారు?
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కొనసాగుతున్న బుల్డోజర్ పరిపాలనను వ్యతిరేకిస్తున్న మనం.. ఇక్కడ అదే చేస్తామంటే ఎలా కుదురుతుంది?’ అని నిలదీసినట్టు తెలిసింది. యూనివర్సిటీ అధికారులు, విద్యార్థి సంఘం ప్రతినిధులతో మాట్లాడి జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందని, సామాన్య పౌరుల మీదికి పోలీసులను ఉసిగొల్పినట్టు విద్యార్థుల మీదికి పోలీసులను పంపారని అగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉన్నాయని, ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నప్పుడు ఆచితూచి ముందుకెళ్లాల్సిందిపోయి ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నారని గట్టిగా తలంటినట్టు సమాచారం. భూమి ప్రభుత్వానిదైనా జాగ్రత్తగా అడుగేయాలని, వివాదాన్ని సామరస్యంగా పరిషరించాలని, అవసరమైతే ఒకడుగు వెనకు వేసినా వచ్చే నష్టం ఏమీ లేదని సూచించినట్టు తెలిసింది.