NDSA | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మార్గదర్శకాలను జారీ చేసిన తర్వాతే మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులను చేపడతామని పదేపదే చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. రిపోర్టును తెప్పించుకునే ప్రయత్నమే చేయలేదు. అసలు ఆ ఎన్డీఎస్ఏ ప్రామాణికత ఏమిటన్నది ఇప్పుడు ఇంజినీరింగ్ వర్గాల్లో, నీటిరంగ నిపుణుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టుల నిర్మాణంలో, సూచనలు చేయడంలో ఆ సంస్థకు ఎలాంటి అనుభ వం లేదని విమర్శిస్తున్నారు. ఎన్డీఎస్ఏ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ ఒక్క దానిపై చిన్న రిపోర్టును కూడా ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఎప్పుడో సూచించిన అంశాలనే మార్గదర్శకాల పేరుతో మధ్యంతర నివేదిక జారీ చేసిందని, అందులోనూ కొత్తగా ఏమీ లేదని పేర్కొంటున్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎంతో విలువైన సమయాన్ని వృథా చేస్తున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నదని నీటిరంగ నిపుణులు, ఇంజినీర్లు మండిపడుతున్నారు.
ఎస్డీఎస్ఏలో ఉన్నదే 25 మంది
దేశవ్యాప్తంగా డ్యామ్‌ల భద్రతకు అనుసరించాల్సిన విధానాలను, నిబంధనలను ఎప్పటికప్పుడు సిఫారసు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో వివిధ విభాగాల నిపుణు లు, రాష్ర్టాల అధికారులతో ప్రత్యేకంగా ఎన్డీఎస్ఏని ఏర్పాటు చేసింది. అదేవిధంగా జాతీ య ప్రాజెక్టుల భద్రత ప్రమాణాలను ఏటా రెండు పర్యాయాలు (సీజన్‌కు ముందు, తర్వాత) నిర్ధారించేందుకు డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానళ్లను ఏర్పాటు చేయాలి. ఆ కమిటీల్లో జియాలజిస్టుతోపాటు సర్వే ఇన్వేస్టిగేషన్, డిజైన్, హైడ్రాలజీ, హైడ్రో మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్, డ్యామ్ బ్రేక్ అనాలసిస్, ఎమర్జెన్సీ యాక్షన్‌ప్లాన్, డ్యామ్ కన్స్ట్రక్షన్, రిహాబిలిటేషన్ తదితర విభాగాల్లో సేవలందించే ఇం జినీర్లను, నిపుణులను నియమించాలి. ఈ అ న్ని క్యాడర్లలో కలిపి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏకు 85 పోస్టులను మంజూరు చేసింది. కానీ ప్రస్తుతం ఎన్డీఎస్ఏలో ఉన్నది 25 మంది మాత్రమే. సమాచార హక్కు చట్టం ద్వారా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని వెల్లడించింది. దీన్ని బట్టి ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ కమిటీయే పూర్తిస్థాయిలో ఏర్పా టు కాలేదని స్పష్టమవుతున్నది. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్డీఎస్ఏలో ఉన్నవారంతా డైవర్షన్ మీద అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నవారే కావడం గమనార్హం.
మూడేండ్లలో ఒక్క రిపోర్టూ ఇవ్వలే
2021లో ఏర్పాటైన ఎన్డీఎస్ఏ ఇప్పటివరకు కనీసం ఒక్క ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను కూడా ఇవ్వలేదు. ఎన్డీఎస్ఏలో ప్రధానంగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అధికారులదే కీలక పాత్ర. అన్ని డ్యామ్ సేఫ్టీ ప్యానల్స్‌కు వారే నాయకత్వం వహిస్తున్నారు. కానీ, వారికి భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో పాల్గొన్న క్షేత్రస్థాయి అనుభవమే లేదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ పనితీరుపై గత మూడేండ్లలో వచ్చిన నివేదికలే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఎన్డీఎస్ఏ ఏర్పాటు త ర్వాత దేశంలోని అనేక భారీ ప్రాజెక్టుల్లో ప్ర మాదాలు వాటిల్లాయి. కానీ, వాటిలో కేవలం 5 ఘటనలే తమ దృష్టికి వచ్చినట్టు ఎన్డీఎస్ఏ వెల్లడించింది. గత మూడేండ్లలో కాళేశ్వ రం ప్రాజెక్టుతోపాటు ముల్ల పెరియార్, తీస్తా, లోయర్ సుబంసిరి, సర్దార్ సరోవర్, తుంగభద్ర తదితర డ్యామ్‌లలో భద్రతా సమస్యలు తలెత్తినప్పటికీ ఎన్డీఎస్ఏ కేవలం రెండు ఘటనలపైనే ఎక్స్పర్ట్ కమిటీలను ఏర్పాటు చేసిం ది. వీటిలో ఓ కమిటీని హిమానీనదాల ప్లాష్ ఫ్లడ్స్‌తో తీస్తా రివర్ ప్రాజెక్టులపై పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు, రెండో కమిటీని కాళేశ్వరం ఘటనపై సిఫారసులు చేసేందుకు ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీలు ఇప్పటివరకు ఒక్క నివేదికను కూడా ఇవ్వలేదు. కాగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం డ్యామ్ పనులన్నీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ఆ డ్యామ్‌కు సంబంధించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని అనేక ఏళ్లుగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. అయినప్పటికీ డయాఫ్రం వాల్ పునరుద్ధరణ కోసం సీడబ్ల్యూసీ గానీ, పీపీఏ గానీ ఇప్పటివరకు ఎలాం టి పరిష్కారాన్ని చూపలేదు. దీన్ని బట్టే కేంద్ర సంస్థల అనుభవం ఏపాటిదో స్పష్టమవుతున్నది. అసలు పోలవరం డ్యామ్ డయాఫ్రం వాల్ ఘటనకు సంబంధించిన వివరాలే తమ వద్ద లేవని ఎన్డీఎస్ఏ చెప్పడం ఆ అథారిటీ పనితీరుకు నిలువెత్తు నిదర్శనం.
మధ్యంతర నివేదికలో పేర్కొన్నవన్నీ రాష్ట్ర ఇంజినీర్లు చెప్పిన అంశాలే
కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులన్నీ ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు ఇచ్చినవే కావడం గమనార్హం. మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ గత అక్టోబర్‌లో కుంగుబాటునకు గురైన వెంటనే 2 రోజుల్లోనే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ అధికారు ల బృందం రాష్ర్టానికి విచ్చేసింది. బరాజ్ కుంగుబాటుపై ఎలాంటి పరీక్షలను నిర్వహించకుండా ఊహాజనిత అంశాలను పొందుపర్చి వారం తిరక్కముందే నివేదికను విడుదల చే సింది. మళ్లీ 4 నెలల తర్వాత బరాజ్ కుంగుబాటునకు కారణాలను అధ్యయనం చేసి, పునరుద్ధరణ చర్యలను సిఫారసు చేసేందుకు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 5 సభ్యులతో నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ని రుడు మార్చి నెలలో రెండు పర్యాయాలు పర్యటించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీల నుంచి వివరాలను సేకరించింది. ఈ సందర్భంగానే ఆ నిపుణుల కమిటీకి రాష్ట్ర ఇరిగేషన్ ఉన్నతాధికారులు పలు విజ్ఞప్తులు చేశా రు. వర్షాకాలంలో బరాజ్ రక్షణ కోసం చేపట్టాల్సిన తక్షణ చర్యలను లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయితే గ్రౌటింగ్ ప నులు మినహా నాడు రాష్ట్ర అధికారులు సూచించిన అంశాలనే తన మధ్యంతర నివేదికలో పేర్కొన్న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ.. విలువైన సమయాన్ని వృథా చేయడం తప్ప చేసిందేమీ లేదని ఇంజినీర్లు విమర్శిస్తున్నారు.
ఇప్పుడు చేతులెత్తిసిన వైనం
14 నెలల సమయం గడచిన అనంతరం ఇప్పుడు కాళేశ్వరంపై పూర్తిస్థాయి రిపోర్టును ఇవ్వలేమంటూ చేతులెత్తేసిన ఎన్డీఎస్ఏ తీరు ‘ఆడలేక పందిరి కురుస’ అన్న చందంగా తయారైంది. అదేమంటే తమ సిఫారసులను ఉల్లంఘించారని ఎన్డీఎస్ఏ కుంటిసాకులు చెప్తున్నది. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటునకు గురైనచోట గ్రౌటింగ్ చేశారని, దీంతో ఇప్పుడు జియోటెక్నికల్ టెస్టులు చేసినా రిపోర్టులు సరిగా రావని కొత్తపాట పాడుతున్నది. అంతేకాకుండా తదుపరి పరీక్షలన్నీ నిలిపివేయాలని, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల రిపోర్టులను అందజేస్తే వాటి ఆధారంగానే తుది నివేదికను సమర్పిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీనిపైనా రాష్ట్ర ఇంజినీర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్డీఎస్ఏ తన అనుభవరాహిత్యాన్ని బయటపెట్టుకోలేక గ్రౌటింగ్ అంశాన్ని సాకుగా చూపుతూ ఇంజినీర్లపై నెపం నెడుతున్నదని మండిపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం తీరును కూడా ఇంజినీర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్డీఎస్ఏ మీదున్న భరోసా తమపై లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రాజెక్టుల్లో లోపాలు సహజమని, వా టిపై పరిశీలన జరిపి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉ న్నదని పేర్కొంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని ఇం జినీర్లు, నీటిరంగ నిపుణులు సూచిస్తున్నారు.