తెలుగుయూనివర్సిటీ, సెప్టెంబర్ 3: వైద్య విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికి డాక్టర్ నోరి దత్తాత్రేయుడి ఆత్మకథ పుస్తకం స్ఫూర్తినిస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడి ఆత్మకథ ‘ది జర్నీ ఆఫ్ మై లైఫ్’ ఆంగ్ల పుస్తకాన్ని శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలుగు వారైన దత్తాత్రేయుడు పేద లకు వైద్యం చేయడంతోపాటు అమెరికా దేశ అధ్యక్షుడికే వైద్యమందించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. క్యాన్సర్ చికిత్సకు వస్తున్న అధునాతన వైద్యవిధానాల గురించి వివరించిన దత్తాత్రేయుడు.. క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పించినట్టు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సకు గడిచిన ఎనిమిదేండ్లలో రూ.750 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎంఎన్‌జే దవాఖానకు సలహాదారుడిగా కొనసాగి ప్రజలకు మంచి వైద్యం అందే లా సేవలందించాలని మంత్రి.. డాక్టర్ దత్తాత్రేయుడిని కోరారు. ఏపీ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీనియర్ పాత్రికేయుడు కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. నేటితరం వైద్యులు సమస్యలను అధిగమించి వృత్తిలో రాణించేలా ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. డాక్టర్ దత్తాత్రేయుడు స్పందిస్తూ ఆధునిక వైద్యంతో క్యాన్సర్ నయం చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెస్కో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.