హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్త జోనల్ విధానం ప్రకారం జిల్లాస్థాయి ఉద్యోగుల కేటాయింపు పూర్తికాగా, జిల్లాలు మారిన వారికి పోస్టింగ్స్ ఇచ్చేందుకు సీఎస్ సోమేశ్‌కుమార్ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఒక జిల్లాలో పనిచేస్తూ, తిరిగి అదే జిల్లాకు కేటాయించి ఉంటే.. వారిని అదే పోస్టులో కొనసాగించనుండగా, కొత్తగా జిల్లా మారిన వారికి మాత్రమే బదిలీలు చేపట్టి పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. బదిలీలకు స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపొందిస్తారు. దానిని సంబంధిత జిల్లా కలెక్టర్ ఆమోదించాలి. ఆ తర్వాత సీనియారిటీ జాబితాను ప్రదర్శించి, ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. బదిలీలు, కేటాయింపులను జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌తోపాటు, సంబంధితశాఖ జిల్లా హెచ్‌వోడీల కమిటీ చేపడుతుంది. వారంలో బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని గడువు విధించారు. బదిలీలు, పోస్టింగ్స్ తర్వాత ఉద్యోగులు మూడు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. జోనల్, మల్టీజోనల్ పోస్టులకు ప్రభుత్వం విడిగా మార్గదర్శకాలు ఇవ్వనున్నది. పోలీస్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, వాణిజ్య పన్నులు తదితర శాఖలు అవసరాన్ని బట్టి విడిగా మార్గదర్శకాలు జారీ చేసుకొనే వెసులుబాటు కల్పించింది.
ఉదాహరణకు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని ఉద్యోగి మంచిర్యాల జిల్లాలో పనిచేస్తూ, తాజా కేటాయింపుల్లో తిరిగి అదే జిల్లాకు కేటాయించి ఉండి, సదరు ఉద్యోగి రిపోర్ట్ చేస్తే అదే పోస్టులో కొనసాగిస్తారు. ఆ ఉద్యోగిని తాజా పోస్టింగ్ కోసం పరిగణనలోకి తీసుకోరు. అదే పూర్వపు ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగి కొత్త నిర్మల్ జిల్లాలో పనిచేస్తూ తాజాగా మంచిర్యాలకు కేటాయించి ఉంటే సంబంధిత ఉద్యోగికి కౌన్సెలింగ్ నిర్వహించి మంచిర్యాల జిల్లాలో ఖాళీలను బట్టి పోస్టింగ్ ఇస్తారు.
ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా మార్గదర్శకాలు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ ధన్యవాదాలు తెలిపారు.
ఇంటర్ విద్యలో జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల విభజనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లా స్థాయి ఉద్యోగుల విభజన పూర్తికాగా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల విభజనకు ఆదేశాలిచ్చారు. ఈ నెల 30లోగా సీనియారిటీ జాబితా విడుదల చేయాలని, 2022 జనవరి 1 -7 వరకు ఆప్షన్లు స్వీకరించి ఉద్యోగులను కేటాయించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. కేటాయించిన మూడు రోజుల్లో సంబంధిత ఉద్యోగులు రిపోర్టు చేయాలని సూచించారు.