SLBC Tunnel Mishap | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ సొరంగం భయంకరంగా మారింది. అడుగు కూడా ముందుకు వేయలేని దుర్భర పరిస్థితి నెలకొన్నది. టన్నెల్‌లోని అడుగడుగునా ప్రతికూల పరిస్థితే ఎదురవుతున్నది. వెరసి లోపలికి వెళ్లిన బృందాలు నిరాశతో వెనుదిరుగుతుండగా, గంటలు గడిచేకొద్దీ చిక్కుకున్న కార్మికుల క్షేమ సమాచారంపై అందరిలోనూ ఆశలు అడుగంటుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ ఇతర బృందాలు మంగళవారం పలు అంశాలను గుర్తించాయి. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ పాయింట్లతో గూగుల్ మ్యాప్‌తో ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని, తీవ్రత ఏమేరకు ఉన్నదనే అంశాలను తెలుసుకున్నారు. వారు నివేదించిన వివరాల ప్రకారం, సొరంగం లోపల అత్యంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. టన్నెల్ దాదాపు 150 మీటర్ల మేరకు కూలిపోయినట్టు తెలుస్తున్నది. టీబీఎం తోక భాగం దాటి కూడా శిథిలాలతో సొరంగం పూడుకుపోయింది.
ఆక్సిజన్ సరఫరా చేసే వెంటిలేషన్ ట్యూబ్ పూర్తిగా వెనక్కి వంగిపోయింది. అతికష్టం మీద టీబీఎం తోకభాగాన్ని దాటుకుని 100 మీటర్ల ముందుకు చేరుకోగలిగినట్టు సహాయ బృందాలు వెల్లడించాయి. మరో 40 మీటర్ల మేర ముందుకు పోలేని పరిస్థితి ఉన్నదని, అక్కడే కార్మికులు చిక్కుకుని ఉన్నారని తెలుస్తున్నది. టన్నెల్లో మూడు కిలోమీటర్ల వరకే అదీ బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. టీబీఎంను దాటుకుని డ్రోన్స్ వెళ్లలేకపోతున్నాయని, రోబోటిక్ కెమెరాలు కూడా పనిచేయడం లేదని తెలిపారు. టన్నెల్ పొడవు 13.85 కి.మీ కాగా, 13.5 మీటర్ల నుంచే పూర్తిగా మట్టి, రాళ్లు, శిథిలాలతో సొరంగం నిండిపోయిందని వివరిస్తున్నారు. కన్వేయర్ 12కి.మీ వరకే లోకోట్రాక్ వినియోగానికి అందుబాటులో ఉన్నదని చెప్తున్నారు. అక్కడి నుంచి 1.11 కి.మీ వరకు లోకోట్రాక్ ఉన్నా వినియోగించలేని పరిస్థితి ఉన్నదని సహాయ బృందాలు వెల్లడిస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయడం లేదని వివరిస్తున్నారు.
బురద ఓ ప్రధాన సమస్య
సొరంగంలో 2.7 కిలోమీటర్ 5.6, 7.6, 10.8, 13.5 కిలోమీటర్ల వద్ద పంపులను ఏర్పాటుచేసి డీవాటరింగ్ చేస్తున్నారు. 10.7 కిలోమీటర్ వద్ద ఊట నీరు లేదని, అయితే 10.95 కి.మీ వద్ద 1.5 అడుగల మేరకు, 11.30 కి.మీ వద్ద 2 నుంచి 2.5 అడుగుల మేరకు నీరు ఉన్నదని, లోపలికి వెళ్లిన కొద్దీ నీటి పరిమాణం పెరుగుతున్నదని వివరిస్తున్నారు. వాలు వైపే ప్రమాదం జరగడంతో నీరు అటువైపే జాలువారుతున్నదని, దీంతో దిగువకు వెళ్లిన కొద్దీ నీటిలోతు పెరుతున్నదని చెప్తున్నారు. నీటిలో బురద ఎక్కువగా ఉండటంతో డీవాటరింగ్ ప్రక్రియ సైతం సజావుగా కొనసాగడం లేదని తెలుస్తున్నది. ప్రస్తుతం ఏర్పాటుచేసిన పంపులు బురదను తొలగించలేకపోతున్నాయని, మొరాయిస్తున్నాయని సహాయ బృందాలు వివరిస్తున్నాయి.
బురదను పంపింగ్ చేసే పంపులు ప్రత్యేకంగా ఉన్నా కూడా వాటిని అక్కడ వినియోగించలేని దుస్థితి ఉన్నదని చెప్తున్నారు. ఇందుకు ఆ పంపులు ఎక్కువ దూరం బురదను పంపింగ్ చేయకపోవడమే కారణమని అంటున్నారు. లోకోట్రాక్ ద్వారా భారీ వాహనాలు కూడా లోపలి వెళ్లే అవకాశం లేకుండా పోయిందని చెప్తున్నారు. వెరసి సొరంగం లోపల సహాయక చర్యలకు ఏ మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తున్నది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్లి, నిస్సాహాయంగా వెనుదిరిగి వస్తున్నాయి. సొరంగంలో లైనింగ్ లేని చోట డ్రిల్లింగ్ చేసిన ప్రదేశం కూడా ఎప్పుడు కూలుతుందోనని భయంభయంగా ముందుకు సాగుతున్నారు.