Green India Challenge | నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆధ్వర్యంలో ప్రకృతిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకువచ్చిన ‘వృక్షవేదం’ ‘హరితహాసం’ పుస్తకాలను కైలాస్ సత్యార్థికి అందించి, సత్కరించారు. అనంతరం కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ పచ్చని ప్రపంచం కోసం ఎంపీ సంతోష్ నిర్విరామంగా కృషి చేస్తున్నారని అభినందించారు. ఈ దేశంలో యువ పార్లమెంటేరియన్ ప్రకృతి పరిక్షణ కోసం, భవిష్యత్ తరాల బాగుకోసం పనిచేయడం గొప్ప విషయమన్నారు.
ఈ నేలను, సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు నాయకులుగా మారితే ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుందని, ఆ కోవలో ప్రథముడు సంతోష్ అంటూ ప్రశంసించారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6.0’ ప్రారంభంలోనే కైలాష్ సత్యార్థి లాంటి గొప్ప వ్యక్తి పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హక్కుల ఉద్యమకారులందరిరీ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ చేరువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణ, విద్యార్థులు, కార్యక్రమం ఫౌండర్ మెంబర్స్ రాఘవ, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.