Gadwal | గద్వాల అర్బన్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి పోలీసు స్టేషన్ వెరీవరీ స్పెషల్. నేను మోనార్క్‌ని.. నన్నెవరూ ఏం చేయలేరు అన్నట్లు ఆ స్టేషన్ ఇన్చార్జి గారు ధీమాగా ఉంటారు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో ఆ స్టేషన్ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా పెట్రోల్ వ్యవహారంలో వార్తల్లోకి ఎక్కింది. ప్రతి నెల పోలీస్టేషన్‌కు 60 లీటర్ల పెట్రోలుకు ప్రభుత్వంనుంచి నిధులు వస్తాయి.
కానీ… గత ఆరు నెలలనుంచి కేటీ దొడ్డి పోలీసులకు పెట్రోల్ ఇవ్వట్లేదు. వారి సొంత వాహనాల్లోనే స్టేషన్ పనుల మీద పోలీసన్నలు గస్తీ తిరుగుతున్నారు. ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో వారికి అర్థం కాక స్టేషన్ సిబ్బంది వారిలో వారే చర్చించుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన స్టేషన్ ఇంచార్జి తెలిసీ తెలియనట్టుగా ఉంటున్నారు. ఇంతకీ నెలనెల వచ్చే పెట్రోల్ బిల్లులు ఎవరి జేబులోకి పోతున్నాయి? ఈ విషయం జిల్లా అధికారులకు తెలుసా.. తెలియదా? అంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పెట్రోల్ బిల్లులు ఇవ్వకపోతే పని చేయాల్సిన స్టేషన్ సిబ్బంది ఎలా పనిచేస్తారని ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ ఇన్చార్జి అయినటువంటి ఎస్ఐ ఏం చేస్తున్నారో అని జనం చర్చించుకుంటున్నారు.