హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఇన్‌ఫ్లూయెంజా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం వైద్యారోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో పరిస్థితులు, ఆరోగ్యశాఖ సన్నద్ధతపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటే సమీప ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చికిత్స పొందాలని సూచించారు. జ్వరం, జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్, నిలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.