హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్-1లో (JEE Main) ఈ సారి ఫిజికల్ కాలిక్యులేటర్లను (Calculators) అనుమతించరు. కొత్తగా ఆన్‌స్క్రీన్ వర్చువల్ కాలిక్యులేటర్ కంప్యూటర్ తెరపైనే ప్రత్యక్షమవుతుంది. ప్రాథమిక లెక్కల కోసం దీనిని వాడుకోవచ్చు. కాగా జేఈఈ మెయిన్-1 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. వివరాల కోసం విద్యార్థులు https ://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఇప్పటికే జేఈఈ మెయిన్-1 పరీక్షా తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. 2026 జనవరి 21-30 తేదీల్లో సెషన్-1 పరీక్షలు జరగనున్నాయి.
ఏప్రిల్ 1-10 తేదీల్లో సెషన్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌కు దరఖాస్తు చేసిన వారు ఏ నగరంలో పరీక్షలు రాయనున్నారో తెలిపే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను జనవరి చివరి వారంలో విడుదలవుతాయి. పరీక్షకు మూడు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌కార్డులను విడుదల చేస్తారు. సెషన్ -1 ఫలితాలను ఫిబ్రవరి 12లోగా విడుదల చేస్తారు. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్ -1, బీఆర్క్‌కు పేపర్ -2ఏ, బీ ప్లానింగ్‌కు పేపర్-2బీలకు పరీక్షలుంటాయి. నిరుడు 14 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సారి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరీక్షను తెలుగు సహా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. 2025లోనే కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. నిరుటితో పోల్చితే సిలబస్, పరీక్షావిధానంలో ఎలాంటి మార్పుల్లేవు.
ముఖ్యమైన అంశాలివే..