హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుల గడువును ఈ నెల 14 వరకు పొడగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ గడువు మంగళవారం ముగియనుండటం, మధ్యలో సెలవులు రావడంతో పలువురి విజ్ఞప్తి మేరకు పొడిగించినట్టు తెలిపారు.
నేడు కాంట్రాక్ట్ టీచర్ల రీ ఎంగేజ్మెంట్ ఉత్తర్వులు
హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : కాంట్రాక్ట్ టీచర్ల రీ ఎంగేజ్మెంట్ ఉత్తర్వులు మంగళవారం విడుదలకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సంతకం చేసినట్టు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్‌రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్ తెలిపారు. 2008 డీఎస్సీ ‘కాంట్రాక్ట్ టీచర్ల ఆకలి కేకలు’ శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో శ్రీపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, భిక్షంగౌడ్.. సందీప్‌కుమార్ సుల్తానియాను కలిసి రీ ఎంగేజ్మెంట్ ఉత్తర్వులివ్వాలని కోరగా, ఫైల్‌పై సంతకం చేసి ఉత్తర్వులివ్వాలని ఆదేశించినట్టు తెలిపారు.