హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రూపొందించిన నూతన లోగోపై దేశవ్యాప్తంగా డాక్టర్లు మండిపడుతున్నారు. కొత్త లోగోలో అక్షరాల పరిమాణం పెంచడంతోపాటు ఆయుర్వేద పితామహుడిగా పిలిచే ధన్వంతరి ఫొటోను రంగురంగులతో ముద్రించారు. ఇండియా, భారతీయ అనే పదాలను తొలగించారు. వాటి స్థానంలో భారత్ అనే పదాన్ని చేర్చారు. ఈ లోగోపై వైద్య సంఘాలు అభ్యంతరం చెప్తున్నాయి.
గతంలో ధన్వంతరి ఫొటో నలుపు రంగులో ఉండేది. కానీ, ఇప్పుడు రంగులుగా మార్చడంతో విష్ణువు రూపంలో ఉన్నదని కొందరు, హిందూ దేవతల రూపంలో కనిపిస్తున్నదని మరికొందరు వాదిస్తున్నారు. కుల,మత, వర్గ, వర్ణాలకు అతీతంగా రోగులందరికీ సేవలు చేయాలన్నది వైద్యుల ప్రాథమిక కర్తవ్యమని, ఈ వృత్తిని స్వీకరించే సమయంలోనే ఈ మేరకు ప్రతిజ్ఞ చేస్తామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ లోగో తమ ప్రతిజ్ఞకు భిన్నంగా ఉన్నదని అంటున్నారు.
కేవలం ఒక మతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఉన్నదంటూ దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సంఘాలు పేర్కొంటున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణశాఖ సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. ఆదివారం ఎన్ఎంసీకి లేఖ రాసింది. కొత్త లోగో వైద్యుల ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని మండిపడింది. వైద్యవృత్తి ఔన్నత్యాన్ని పెంచేలా మంచి సంస్కరణలు తీసుకురావాల్సిన సంస్థ, ఇలాంటి చర్యలకు పాల్పడటం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. వెంటనే ఎన్ఎంసీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేసింది.