ఖలీల్‌వాడీ, మే 17: యాదవ, కురుమలతోపాటు రైతాంగాన్ని కించపరిచిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఈ నెల 24లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేదంటే గాంధీభవన్‌ను దున్నపోతులతో ముట్టడిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ హెచ్చరించారు. బుధవారం నిజామాబాద్ నగరంలో జిల్లా యాదవ కుర్మ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మా ట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు యాదవ, కురుమలను, రైతాంగాన్ని కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు.
దేశ నాగరికతకు వ్యవసాయమే మూలమని, మొదట దున్నపోతులతోనే వ్యవసాయం చేశారని, దున్నపోతులు బర్రెలు, ఎద్దులు, ఆవులు భారతీయ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. ఈ దేశంలో యాదవులు పశుపాలన ద్వారా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సమాజానికి అందిస్తు న్న విషయాన్ని గుర్తుచేశారు. పేడను ఎరువుగా మార్చి వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్న విషయం రేవంత్‌రెడ్డికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు.