నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు జలకళ వచ్చింది. రహదారులపై వరద ఉధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో 150 మి.మీ నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయయమయ్యాయి. వీటికి తోడు గోదావరిలో వర ద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుల్లో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి బలపడి అల్పపీడనంగా మారనున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భార త వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణశాఖ కేంద్రం జారీ చేసింది. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది.
నేడు వానలు కురిసే జిల్లాలు
మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉం దని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలతోపాటు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా ల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది.
నిజామాబాద్ జిల్లాలో బడులకు సెలవు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యాశాఖ అధికారులు సోమవారం బడులకు సెలవును ప్రకటించారు. ఆర్మూర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతు సంగెం గ్రామానికి చెందిన రైతు గౌరి సంగయ్య సోమవారం తన పొలానికి వెళ్లాడు. పక్కనే ఉన్న పెద్దవాగులో వరద ఒకేసారి పెరగడంతో రేకుల షెడ్డుపైకి ఎక్కి కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిజామాబాద్ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బందితో ఎమ్మెల్యే సురేందర్ స్వయంగా బోటులో వెళ్లి రైతును ఒడ్డుకు తీసుకొచ్చారు. జుక్కల్-బస్వపూర్ మధ్యలో వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రోడ్డు కోతకు గురవడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. సిరికొండ మండలంలో కప్పల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. గడ్కోల్ వద్ద లోలెవల్ బ్రిడ్జ్‌పై వాహనాలను అధికారులు నిలిపివేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మోస్తరు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని అక్సాన్‌పల్లి పెద్ద చెరుకు కట్టతెగిపోయింది. అధికారులు మరమ్మతులు చేపట్టారు. చిన్నచెల్మడ-అంతారం శివారులో వాగులో చిక్కుకున్న కారును స్థానికులు ఒడ్డుకు చేర్చారు. నలుగురిని కాపాడారు. సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులోకి స్వల్పంగా వర్షం నీరు వచ్చి చేరింది. జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తుంది. మునిపల్లి మండలం చిన్నచెల్మడ-అంతారం మధ్య అంతారం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంగ్టి నుంచి బీదర్ వెళ్లే దారిలో ఉండే బీమా వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మెదక్‌లోని సాయినగర్‌కాలనీ, నల్లపోచమ్మ దేవాలయం వెనక కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో వర్షం నీరు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ముసురు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సోమవారం ముసురు పట్టేసింది. గంగాధర మండలం వెంకటయ్యపల్లిలో పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరమగ్గాల పరిశ్రమ పాక్షికంగా స్తంభించింది. గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరులోకి మెదక్‌జిల్లా నుంచి కూడెల్లి, నిజామాబాద్ జిల్లా నుంచి పాల్వంచ వాగులతో వరద పోటెత్తింది. భారీ వర్షాలకు వేములవాడ మూలవాగుపై బొల్లారం వద్ద నిర్మించిన చెక్‌డ్యాం కొట్టుకుపోయి వరద నీరంతా గ్రామ శివారు నుంచి ప్రవహిస్తున్నది. జగిత్యాలలోని సారుగమ్మ వీధి, టవర్‌సర్కిల్, మార్కెండేయ కాలనీలు జలమయమయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. వనపర్తి జిల్లా కొ త్తకోట మండలం పాత జంగమాయపల్లి-కనిమెట్ట మధ్య ఊకచెట్టు వాగు పారింది. వాగుపై నిర్మించిన మట్టిరోడ్డు తెగింది. ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లి, పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోతెత్తడంతో రెండు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. ఆదిలాబాద్‌లో భారీ వానకు రోడ్లు జలమయమయ్యాయి. భూపాలపల్లిలో ఓపెన్ కాస్ట్ పనులకు అంతరాయం కలుగుతున్నది.
Water1
రెడ్ అలర్ట్ ఎప్పుడు జారీ చేస్తారంటే!
వర్షాకాలంలో జారీచేసే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌ల గురించి వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వివరించారు.
ఎల్లో అలర్ట్: 64.5 మి.మీ నుంచి 115.5 మి.మీ మధ్య వర్షపాతం పడే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ఇస్తారు.
ఆరెంజ్ అలర్ట్: ఒక రోజులో 115.6 నుంచి 204.4 మి.మీ మధ్య వర్షపాతం నమోదయ్యే పరిస్థితుల్లో ఆరెంజ్ అలర్ట్ ఇస్తారు.
ఆరెంజ్ అలర్ట్: 24 గంటల వ్యవధిలో 204.5 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. వర్షం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని భావించినప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.
బ్లూ అలర్ట్: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు బ్లూ అలర్ట్ జారీ చేస్తారు. ప్రజలు పిడుగుల బారిన పడకుండా ఉండేందుకు ఈ హెచ్చరిక చేస్తారు.
రైతును కాపాడినఫైర్ సిబ్బంది
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతు సంగెం గ్రామానికి చెందిన రైతు గౌరి సంగయ్యను నిజామాబాద్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది బోటు సాయంతో కాపాడినట్టు ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం రైతు సంగయ్య ఏరు దాటి పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం అనూహ్యంగా ఏరు వరద పెరగడంతో మధ్యలోనే చిక్కుకుపోయాడు. అత ను బంధువులకు సమాచారం అందిచడంతో వారు అగ్నిమాపక సిబ్బందిని సంప్రదించారు. నిజామాబాద్ ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు బోట్లలో వచ్చి రైతు సంగయ్యను రక్షించారు. రైతును రైతును కాపాడిన ఫైర్ స్టేషన్ల సిబ్బందిని నాగిరెడ్డి అభినందించారు.
Var