ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలోని నిజాం కళాశాల విద్యార్థుల హాస్టల్ మెస్‌ను అధికారులు రెండు రోజుల క్రితం మూసివేశారు. అప్పటి నుంచి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తార్నాకలోని ఇంటర్నేషనల్ హాస్టల్లో నిజాం కళాశాల విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించి, అందులోనే వారికి మెస్‌ను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్సమెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో మెస్ నిర్వహణ భారంగా మారింది. బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో నిత్యావసరాల రాక సైతం నిలిచిపోయింది. దీంతో మెస్‌ను మూసివేశారు. మెస్ మూసివేతపై కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా, నిధుల కొరతతో మూసివేసినట్టు చెప్పారని విద్యార్థులు తెలిపారు. నిజాం కళాశాల విద్యార్థులకు కాంగ్రెస్ పాలనలో భోజనం పెట్టలేని దుస్థితి నెలకొన్నదని వాపోయారు. కళాశాలకు నిధుల కొరత ఉన్నప్పటికీ వర్సిటీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మెస్‌ను వెంటనే ప్రారంభించాలని, లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని, రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.