గురువారం 28 మే 2020
Telangana - May 23, 2020 , 03:08:34

ఆ బావిలో 9 శవాలు

ఆ బావిలో 9 శవాలు

  • తాజాగా 5 మృతదేహాలు లభ్యం 
  • మృతులంతా వలస కూలీలే 
  • మిస్టరీగా వరంగల్‌ రూరల్‌ జిల్లా విషాదం
  • విషప్రయోగంగా  అనుమానిస్తున్న పోలీసులు

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ: వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఒకే బావిలో 9 మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. గురువారం 4 మృతదేహాలు వెలుగుచూడగా, శుక్రవారం మరో 5 బయటపడ్డాయి. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన పశ్చిమ బెంగాల్‌వాసులు కాగా, ఇద్దరు బీహార్‌, ఒకరు త్రిపురవాసిగా పోలీసులు గుర్తించారు. ఒకే బావి లో అన్ని మృతదేహాలు దొరకడం పలు అనుమానాలకు తావిస్తున్నది. విషప్రయో గం జరిగి ఉంటుందా? అనే కోణంలో పోలీసు లు దర్యాప్తు సాగిస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలోని బార్‌దాన్‌ గోడౌన్‌ ఆవరణలో ఉన్న బావిలో శుక్రవారం మరో 5 మృతదేహాలను బయటకు తీశారు. వీరిలో త్రిపురకు చెందిన షకీల్‌ కుటుంబం కొన్నేండ్ల నుంచి వరంగల్‌లోని శాంతినగర్‌లో ఉంటున్నది. మరో ఇద్దరు మృతులు షాబాద్‌, సోహైల్‌ ఇంతకుముందు ఇదే బావిలోచనిపోయిన  మక్సూద్‌, నిషాల కుమారులు. మిగిలిన ఇద్దరు బీహార్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. మక్సూద్‌ కుటుంబంలోని ఆరుగురు, బీహార్‌ కూలీలు ఇద్దరు ఈ గోడౌన్‌ ఆవరణలోని వేర్వేరు గదుల్లో నివసించేవారు. వరంగల్‌ సీపీ వీ రవీందర్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. దర్యాప్తును వేగవంతం చేయాలని అడిషనల్‌ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌ శివరామయ్యను ఆదేశించారు. షకీల్‌ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మిగతా 8 మృతదేహాలను ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, వరంగల్‌ సీపీ రవీందర్‌, వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ ఎం హరిత వేర్వేరుగా ఎంజీఎంలోని మృతదేహాలను పరిశీలించారు.



logo