ఖైరతాబాద్, సెప్టెంబర్ 3 : గుండెలో విద్యుత్తు తరంగాల హెచ్చుతగ్గుదలతో బాధపడుతున్న ఓ దినసరి కూలీకి నిమ్స్ దవాఖాన వైద్యులు ఎలాంటి కోత, కుట్టు లేకుం డా విజయవంతంగా చికిత్సనందించారు. నిమ్స్ దవాఖానలోని లెర్నింగ్ సెంటర్లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీనియర్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిసతీశ్ ఈ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కార్మికుడు (30) గత రెండేండ్లుగా గుండెలో దడ, ఆయాసం, కండ్లు తిరగడం లాంటి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు ప్రైవేట్ దవాఖానలు లక్షల రూపాయలు ఫీజుగా కోరడంతో అతడు నిమ్స్‌కు వచ్చాడు. బాధితుడికి 2డీ ఎకో కార్డియోగ్రఫీ, కార్డియాక్ పెట్ స్కాన్, హోల్టర్ మానిటరింగ్ తదితర పరీక్షలు నిర్వహించారు. హోల్టర్ మానిటరింగ్‌లో గుండె సాధారణంగా కొట్టుకోవాల్సిన దానికంటే 57 శాతం వేగంగా కొట్టుకోవడంతోపాటు వైద్య పరిభాషలో నాన్ సస్టెయిన్డ్ వెంట్రిక్యూలర్ టాకికార్డియా సమస్య ఉన్నట్టు గుర్తించారు. గత నెల 24న రోగికి అత్యాధునిక 3డీ మ్యాపింగ్ ద్వారా ఎలాంటి కోత, కుట్టు లేకుండా చిన్న క్యాథటర్ను నరాల ద్వారా సమస్య ఉన్న ప్రాంతానికి పంపించారు.
ఎలక్ట్రోఫీజియలాజికల్ స్టడీ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ విధానంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని గుండెలో విద్యుత్తు ప్రసారంలో హెచ్చుతగ్గులున్న ప్రాంతాన్ని సుమారు రెండుగంటలకు పైగా కష్టపడి సరిచేశారు. కార్పొరేట్ దవాఖానలో ఈ చికిత్సకే రూ.5 లక్షలు అవుతుందని, ఇతర ఖర్చులతో మొత్తం రూ.10 లక్షలు అవుతుందని డాక్టర్ సాయిసతీశ్ చెప్పారు. గుండెలో అత్యంత సున్నిత ప్రాంతంలో సమస్యను గుర్తించామని, దానిని వదిలేస్తే అది హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీస్తుందని అన్నారు. దినసరి కూలీ అయిన బాధితుడు అంత డబ్బు పెట్టుకోలేనందున ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు కింద పూర్తిగా ఉచితంగా ఈ చికిత్సను అందించామని చెప్పారు. ప్రతి ఏడాది 150 మందికిపైగా త్రీడి మ్యాపింగ్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్సలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని ఇక జీవిత కాలంలో మందులే వాడనవసరం లేదని వివరించారు. ఈ చికిత్సలో తనతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ హేమంత్, డాక్టర్ నియాజ్, డాక్టర్ జగదీశ్ పాల్గొన్నారని తెలిపారు.