హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరి శుక్రవారం విచారణకు హాజరయ్యారు. లక్డీకాపూల్లోని సీఐడీ కార్యాలయంలో సిట్ అధికారులు వారిని గంటకుపైగా ప్రశ్నించారు. నిధి అగర్వాల్ ‘జీత్ విన్’ బెట్టింగ్ సైట్ను, శ్రీముఖి ‘ఎం88’ బెట్టింగ్ యాప్ను, అమృత చౌదరి ‘యోలో 247’, ‘ఫెయిర్ ప్లే’ బెట్టింగ్/గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఏయే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు? అందుకు ఎంత పారితోషికం తీసుకున్నారు? ఏ ఖాతాల్లో డబ్బు జమైంది? బెట్టింగ్ యాప్ల నిర్వాహకులతో ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? బ్యాంకు లావాదేవీలన్సీ సవ్యంగానే ఉన్నాయా? హవాలా మార్గంలో ఏమైనా లావాదేవీలు జరిగాయా? అనే అంశాలపై అధికారులు వారిని ఆరా తీసినట్టు సమాచారం.