హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ మల్లన్న బీసీల అంశంపై మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవితను అనుచిత పదజాలంతో దూషించారు.
దీంతో అతని వ్యాఖ్యలు సభ్యసమాజంలో తలదించుకునేవిగా ఉన్నాయంటూ న్యాయవాది కారుపోతుల రేవంత్ జాతీయ మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. రేవంత్ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ డీజీపీకి ఆదేశాలిచ్చింది. మహిళా ఎమ్మెల్సీపై అనాలోచితంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకొని, నాలుగు వారాల్లో తమకు నివేదికను సమర్పించాలని డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.