NHRC | సంగారెడ్డి నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): లగచర్ల ఘటనపై విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్ వేగవంతం చేసింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో శనివారం పర్యటించిన కమిషన్ బృందం, ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న లగచర్ల రైతులను కలిసింది. తమ వాళ్లను అక్రమంగా అరెస్టు చేశారని, తమకు న్యాయం చేయాలని లగచర్ల బాధిత కుటుంబాలు ఢిల్లీకి వెళ్లి చేసిన విజ్ఞప్తిపై స్పందించిన కమిషన్ రాష్ర్టానికి బృందాన్ని పంపింది. కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేశ్, ఇన్స్పెక్టర్లు యతిప్రకాశ్ శర్మ, రోహిత్‌తో కూడిన బృందం శనివారం లగచర్లలో పర్యటించింది. ఆదివారం ఉదయం సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న 19 మంది బాధిత రైతులను బృందం సభ్యులు కలిశారు. లగచర్ల ఘటన, అరెస్టులకు సంబంధించి ప్రతి ఒక్కరినీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం తమను అక్రమంగా అరెస్టు చేసిందని, పోలీసులు హింసించారని, తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు ఎన్‌హెచ్చార్సీ బృందం సభ్యులను వేడుకున్నట్టు సమాచారం. బాధిత రైతుల్లో కొందరు కన్నీరుపెడుతూ తమను అక్రమంగా అరెస్టు చేశారని తమపై బనాయించిన తప్పుడు కేసులను ఎత్తివేసి న్యాయం చేయాలని కోరినట్టు తెలిసింది. కాగా ఎన్హెచ్చ్చార్సీ బృందం సభ్యులు ప్రతి బాధిత రైతు చెప్పిన వివరాలను రికార్డు చేసుకున్నట్టు సమాచారం. నాలుగు గంటల పాటు ఎన్‌హెచ్చార్సీ సభ్యులు సుదీర్ఘంగా బాధిత రైతులతో వివరాలు సేకరించారు. వారివెంట వికారాబాద్ జిల్లా గిరిజన శాఖ అధికారులు ఉన్నారు. నేడు వికారాబాద్ జిల్లా అధికారులతో సమావేశమై లగచర్ల ఘటనపై వివరాలు సేకరించనున్నారు. కాగా కందిజైలులో ఉన్న లగచర్ల బాధితులను సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా కలవనున్నది.
వికారాబాద్, నవంబర్ 24 : లగచర్లలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు ఆదివారం సాయంత్రం వికారాబాద్ కలెక్టరేట్‌కు వచ్చారు. అక్కడ కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌ను కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ లా ముకేశ్‌తోపాటు సభ్యులు రోహిత్‌సింగ్, యతీప్రకాశ్శర్మ కలిశారు. లగచర్లలో కలెక్టర్‌కు ఎదురైన ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. రాత్రి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.