హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో స్టే విధిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను తుది ఉత్తర్వులు వెలువడేవరకూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) సౌత్ బెంచ్ పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ పుష్పసత్యనారాయణ, ప్రశాంత్ గార్గవ్ల ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ బహుళార్ధసాధక ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణంతో ములుగు జిల్లాలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముంపునకు గురవుతున్నది. ఈ ప్రాంతంలో గోదావరి నుంచి 42,95,394క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ మేరకు ములుగు కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ ఏప్రిల్ 25న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇది పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని పునేం రాములు తదితరులు ఎన్జీటీని ఆశ్రయించారు. ఇప్పటికే పర్యావరణ అనుమతి పొందకుండా గణనీయమైన పరిమాణంలో ఇసుక తవ్వారని, అది చట్టవిరుద్ధమని వెల్లడించారు. ఆ పిటిషన్‌ను ఎన్జీటీ సౌత్ జోన్ బెంచ్ జస్టిస్ పుష్పసత్యనారాయణ ధర్మాసనం విచారించడంతోపాటు ఆయా అంశాలపై వివరణ ఇవ్వాలని ములుగు కలెక్టర్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తోపాటు బాధ్యులను ఆదేశించింది. అప్పటివరకు ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని ఎన్జీటీ ఆదేశాలను 21వ తేదీన జారీ చేసింది. తాజాగా పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఇసుక తవ్వకాలకు సంబంధించి విచారణను సెప్టెంబర్18కి వాయిదా వేసింది.