హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. ఒక్కరోజులోనే కొత్త కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు భారీ గా పెరిగాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 403 మందికి పాజిటివ్‌గా తేలింది. సోమవారం 246 కేసు లు ఉండగా.. ఒక్క రోజులోనే 157 కేసులు అదనంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు సైతం 1.19 శాతం నుంచి 1.50కు పెరిగింది. దీంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటూ మార్గదర్శకాలు విడుదలచేసింది. హైదరాబాద్‌లోనూ కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే 240 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 103, మేడ్చల్ మల్కాజిగిరిలో 11 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలోనే 87.8 శాతం కేసులుండటం ఆందోళన కలిగిస్తున్నది.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు ఏయే గ్రూప్ వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ డీపీహెచ్ శ్రీనివాసరావు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆందోళ న చెందాల్సిన పనిలేదని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు.
కొత్త కేసులు 403
మరణాలు 0
కోలుకున్నవారు 145
రికవరీరేటు 99.19%
వల్నరబుల్ గ్రూప్: పదేండ్లలోపు పిల్లలు, 60 ఏండ్లు దాటిన వృద్ధులు అవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు.
ప్రభావితం అయ్యే గ్రూప్: గణాంకాల ప్రకారం 20-50 ఏండ్ల మధ్య వయస్కులు ఎక్కువగా కొవిడ్ బారిన పడుతున్నారు. కాబట్టి ఈ వయస్కులు పని ప్రదేశాల్లో తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి.
దీర్ఘకాలిక రోగులు: బీపీ, మధుమేహం, గుండెజబ్బులు, మూత్రపిండ వ్యాధులు వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నవారు కచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. వైద్యుల సలహా మేరకే ప్రయాణాలు చేయాలి.