Tragedy | పెండ్లయిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు నారాయణ (27), అంజలి(22) మృతిచెందారు. ఈ విషాద సంఘటన శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నింపింది. ఎస్సై పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ నివాసి గుగునాగ్ గోపి- సునీత దంపతుల కుమార్తె అంజలికి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామవాసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ నారాయణతో గత మార్చి 9న వైభవంగా కల్యాణం జరిపించారు. ఆ తర్వాత వారు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై అంజలి తన భర్తతో కలిసి తల్లిగారింటికి వస్తుండగా మరిపెడ మండలం తానంచర్ల వద్ద భద్రాచలం-సూర్యాపేట వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో వారిద్దరికి సంఘటన స్థలంలోనే తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దవాఖానకు తరలించాలని ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు పోయినట్లు గుర్తించారు. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మృతదేహలకు నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.