హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పట్టణాలతో పాటు వాటి సమీప గ్రామాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం పట్టణాభివృద్ధి సంస్థ ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యే నాటికి తెలంగాణలో కేవలం రెండు పట్టణాభివృద్ధి సంస్థలు (హెచ్ఎండీఏ, కుడా) మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 10కి చేరింది. దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందున్నది. రానున్న కొన్ని సంవత్సరాల్లో సగం మంది తెలంగాణ ప్రజలు పట్టణాల్లోనే ఉంటారన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 8 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, సిద్దిపేట కేంద్రంగా ఇవి ఏర్పాటయ్యాయి. వీటితోపాటు యాదాద్రి, వేములవాడ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం మరో రెండు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటుచేసి నిధులు కేటాయిస్తున్నది.
చెరువులు, నాలాలు, కుంటలు, వాగులు, నదులు, ఉపనదులను పరిరక్షించడం పట్టణాభివృద్ధి సంస్థల బాధ్యత. వీటి ద్వారా పట్టణాలు, గ్రామాల్లో స్థలాలను వెంచర్లుగా వేసి విక్రయిస్తున్నారు. ప్రతి పట్టణాభివృద్ధి పరిధిలో కనీసం వెయ్యి ఎకరాల భూమిని వెంచర్లుగా వేసి కాలనీలు, వాణిజ్య భవన సముదాయాలకు అనువుగా అభివృద్ధి చేస్తున్నారు. పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో అవుటర్ రింగ్ రోడ్లను నిర్మించి గ్రీనరిని అభివృద్ధి చేస్తున్నారు. శాటిలైట్ టౌన్‌షిప్‌లను నిర్మించి ప్రధాన నగరాలపై ఒత్తిడి తగ్గిస్తున్నారు.
