హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలో అత్యంత వేగంగా ప్రగతి సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. 2014లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.5.5 లక్షల కోట్లు ఉంటే, గత ఏడాది రూ.11.58 లక్షల కోట్లకు పెరిగినట్టు వెల్లడించారు. జిల్లాలను ఆర్థికాభివృద్ధి చోదకాలుగా రూపొందించే అంశంపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ గౌబాతో కలిసి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోమేశ్‌కుమార్, కరీంనగర్ జిల్లాను ప్రధానంగా తీసుకొని రాష్ట్ర ప్రణాళికను వివరించారు. కరీంనగర్ జిల్లా ఆర్థిక వ్యవస్థ, పురోభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్ అందించారు. రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కార్యక్రమాలను ఎలా అమలు చేస్తారనే అంశాన్ని వివరించారు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఆయిల్‌పాం సాగు పెంపు, దళితబంధు తదితర పథకాలు జిల్లా అభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా గుర్తించామని, కరీంనగర్లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్‌కుమార్, అధర్ సిన్హా, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎస్సీడీ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు ఇతరులు పాల్గొన్నారు.