Google Maps | హైదరాబాద్, జూలై 25: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంటే గల్లీల్లో ఇరుక్కుపోయాం. ఫ్లైఓవర్‌పై నుంచి రావాలని తెలియక కింద నుంచి వెళ్లి సిగ్నల్ దగ్గర ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం. గూగుల్ మ్యాప్స్ వినియోగించే చాలామంది ఇలాంటి అనుభవాలను చెప్తుంటారు. ఈ సమస్యలకు ఇప్పుడు గూగుల్ పరిష్కారాలను తీసుకువచ్చింది. భారత్‌లో గూగుల్ మ్యాప్స్‌కు ఆరు సరికొత్త ఫీచర్లను జోడించింది. ఈ ఫీచర్ల ద్వారా వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యం చేరుకోవచ్చని గూగుల్ చెప్తున్నది. ఈ వారం నుంచి ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.
గూగుల్ కొత్తగా ‘న్యారో రోడ్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూ, ఇతర డాటా ద్వారా కృత్రిమ మేధ(ఏఐ) ఇరుకు రోడ్లను గుర్తిస్తుంది. మ్యాప్స్‌లో దారి చూపించేటప్పుడు ‘న్యారో రోడ్’ అని సూచిస్తుంది. తద్వారా వాహనదారులు ఆ రోడ్డును వదిలి మరో మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై వంటి ఎనిమిది నగరాల్లో తీసుకువచ్చింది.

గూగుల్ మ్యాప్స్‌లో అడ్రస్ పెట్టుకొని మనం వెళ్లే రోడ్డులో ఫ్లైఓవర్ వచ్చినప్పుడు దాని మీద నుంచి వెళ్లాలా, కింది నుంచి వెళ్లాలా అనేది చాలా పెద్ద గందరగోళంగా ఉంటుంది. ఈ సమస్యను గూగుల్ కొత్త ఫీచర్ పరిష్కరించింది. ఇప్పుడు మ్యాప్స్‌లో ఫ్లైఓవర్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఫ్లైఓవర్ నుంచి వెళ్లాల్సి ఉంటే ‘టేక్ ఫ్లైఓవర్’ అనే సూచన కనిపిస్తుంది. ఈ ఫీచర్ దేశంలోని 40 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.

గూగుల్ మ్యాప్స్‌లో మెట్రో రైలు రూట్ మాత్రమే కాదు మెట్రో టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఓఎన్డీసీ, నమ్మ యాత్రి సంస్థలతో కలిసి గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే, ఇప్పటివరకైతే ఇది కొచ్చి, చెన్నై మెట్రోలకు మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మిగతా నగరాల్లోనూ అందుబాటులోకి రానున్నది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మ్యాప్స్‌లో గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 8,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లను మ్యాప్స్‌తో అనుసంధానం చేసింది. ఈవీ వినియోగదారులు మ్యాప్స్‌లో చార్జింగ్ స్టేషన్లను గుర్తించొచ్చు. ఏ చార్జింగ్ స్టేషన్లో ఎలాంటి చార్జర్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు భారత్‌లో మాత్రమే ఇలా ద్విచక్ర వాహనాల ఈవీ చార్జింగ్ స్టేషన్లు సైతం మ్యాప్స్‌తో అనుసంధానం అయ్యాయి.
ఏదైనా కొత్త నగరానికి వెళ్లినప్పుడు పర్యాటకులు గూగుల్ మ్యాప్స్పై ఎక్కువగా ఆధారపడతారు. అయితే, ఆ ప్రాంతంలో చూడాల్సిన ప్రదేశాలు తెలుసుకోవడానికి ఇతరులను అడగడమో, ఇంటర్నెట్లో సెర్చ్ చేయడమో తప్పేది కాదు. ఇక, నుంచి గూగుల్ మ్యాప్స్‌లోనే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ప్రదేశాలు, టూరిస్ట్ స్పాట్లు తెలిసిపోతాయి. పది నగరాల్లో స్థానిక నిపుణులతో జాబితాలు సిద్ధం చేసి మ్యాప్స్‌లో పొందుపరిచింది.
మనం ప్రయాణించే రోడ్డుపై ఏదైనా సమస్య ఉన్నా, రోడ్డు ప్రమాదం జరిగినా, రోడ్డు మూసి ఉన్నా, వాహనం నిలిచిపోయినా, వాహనాలు ఆలస్యంగా కదులుతున్నా మ్యాప్స్‌లో రిపోర్ట్ చేసేందుకు ‘రిపోర్ట్ యాన్ ఇన్సిడెంట్’ అనే ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం ఆ రోడ్డులో రియల్-టైమ్ ట్రాఫిక్ పరిస్థితులను ఇతర వినియోగదారులకు గూగుల్ తెలియజేస్తుంది.