హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా బాధితులకు సత్వర న్యాయాన్ని అందించేందుకు జూలై 1 నుంచి దేశంలో 3 కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయని నల్సార్ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు వెల్లడించారు. ఆయా చట్టాలపై సోమవారం సమాచార కార్యాలయంలో పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. బ్రిటిషర్ల హయాంలో చేసిన భారత శిక్షా సృ్మతి-1860 (ఐపీసీ), క్రిమినల్ ప్రొసిజర్ కోడ్-1973 (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం చట్టాలను అమలు చేయనున్నట్టు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించారని, ఇవి శిక్ష కంటే న్యాయంపై ఎక్కువగా దృష్టి సారిస్తాయని, అసమంజసమైన వాయిదాలను అరికట్టడం ద్వారా బాధితులకు సత్వర న్యాయాన్ని అందించేందుకు కాలపరిమితిని నిర్ణయిస్తాయని వివరించారు. మాజీ ఐజీ దామోదర్ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేందుకు కొత్త క్రిమినల్ చట్టాలు దోహదపడతాయని, వీటిపై అందరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. కొత్త క్రిమినల్ చట్టాల్లో చేసిన మార్పుల గురించి సీడీటీఐ డైరెక్టర్ ఎన్ రాజశేఖర్ వివరించారు. మహిళలు, పిల్లల హకుల పరిరక్షణ కోసం న్యాయ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నట్టు తెలిపారు. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారని, చిన్న నేరాలకు పాల్పడినవారికి సమాజ సేవను శిక్షగా విధించనున్నారని, ఆర్థిక, సైబర్ నేరాలను వ్యవస్థీకృత నేరాలుగా వర్గీకరించారని వెల్లడించారు.