హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని వచ్చే ఉగాది రోజున బాచుపల్లిలోని కొత్త క్యాంపస్‌కు తరలించాలని వర్సిటీ వర్గాలు ప్రాథమికంగా నిర్ణయించాయి. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసి ఏప్రిల్ 2న కొత్త క్యాంపస్‌ను ప్రారంభించాలని భావిస్తున్నాయి. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయించాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని బాచుపల్లిలో తెలుగు వర్సిటీకి 100 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. రాష్ట్రీయ ఉచ్ఛత్తర్ అభియాన్ పథకం (రూసా) కింద వర్సిటీకి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతానికి ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిజాంపేట కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో రోడ్లు, మంచినీటి వసతి కల్పన చేపడుతున్నారు. మార్చిలోగా పనులన్నీ పూర్తిచేసి, ఏప్రిల్‌లో ప్రారంభించాలని వర్సిటీ అధికారులు పనిచేస్తున్నారు. నూతన భవనం ప్రారంభమయ్యాక కూడా నాంపల్లిలోని ప్రస్తుత క్యాంపస్‌ను అలాగే కొనసాగించనున్నారు. కొత్త వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ తంగెడ కిషన్‌రావు క్యాంపస్ తరలింపు ప్రధాన ఎజెండాగా కసరత్తు చేశారు.