Telangana | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో ఎంట్రీ ఇస్తున్న కొత్త బ్రాండ్ బీర్లు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక రాష్ట్రంలో ‘భూం భూం’ పేరుతో ఉన్న బీరును తెలంగాణలో ‘బీర్యానీ’ పేరుతో ప్రవేశపెడుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వాటిలో ఫొటోలు దర్శనమిస్తున్నాయి. మద్యం ప్రియులకు అలవాటైన పాత బ్రాండ్ల కొరత రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతున్నది. ఉద్దేశపూర్వకంగానే మద్యం కృత్రిమ కొరత సృష్టించారని ఓవైపు ఆరోపణలు వస్తుండగా.. ఈ కొరత కారణంగానే కొత్త కంపెనీలకు అనుమతిచ్చామని ప్రభుత్వం పేర్కొంటున్నది. ఇటీవల ఐదు కొత్త బీర్ల కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ వెనుక ఓ మాజీ ఐఏఎస్ అధికారి కీలకపాత్ర పోషిస్తున్నట్టు మద్యం వ్యాపారులు చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఓ విభాగానికి సెక్రటరీగా ఉంటూ రిటైర్ అయిన ఓ ఐఏఎస్ అధికారి.. ఇటీవల కొత్త ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యారని.. ఆయనే ప్రభుత్వ పెద్దల పంచన చేరి, అనధికారిక మద్యం పాలసీలో చక్రం తిప్పుతున్నాడని విశ్వసనీయ సమాచారం. ఆయన ఓ డిస్టిలరీ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ.. కొన్ని మద్యం కంపెనీలకు ముడిసరుకు ఇచ్చే వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు కూడా కిమ్మనకుండా ఆయన చెప్పింది ఫాలో అవుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొత్త బ్రాండ్లను పథకం ప్రకారం తెలంగాణకు రప్పించడం వెనుక ఆయన హస్తం ఉన్నదని సమాచారం. తన పలుకుబడిని ఉపయోగించి మరికొన్ని కొత్త కంపెనీలను కూడా తెలంగాణకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు.
తెలంగాణలో వచ్చే కొత్త బ్రాండ్ల మద్యం నాణ్యత, అమ్మకాలపై మద్యం వ్యాపారుల్లో సంశయం నెలకొన్నది. ఇటీవల బేవరేజెస్ కార్పొరేషన్ కొత్తగా ఐదు మద్యం కంపెనీల నుంచి 27 రకాల కొత్త ఉత్పత్తులకు అనుమతులు ఇచ్చింది. ఈ కొత్త ఉత్పత్తులు మద్యం ప్రియులకు నచ్చుతాయా లేదా, ఒకవేళ అవి కల్తీవి అన్న అనుమానంతో కొనుగోళ్లు జరగకపోతే తమ పరిస్థితి ఏమిటని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రవేశిస్తున్న కొన్ని కంపెనీల నుంచి ఇదివరకే కల్తీ మద్యం తయారైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ‘సోం డిస్టిలరీస్’ సంస్థపై అనేక వివాదాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కోసం ఈ సంస్థ ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్టు మధ్యప్రదేశ్‌లోని పలు మీడియా సంస్థలు బ్యాంకు ఆధారాలను కూడా బయటపెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్నికల ఫండింగ్లోనూ ఈ సంస్థ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. దీంతో ఇటువంటి కంపెనీల నాణ్యమైన మద్యాన్ని ఆశించగలమా అని మద్యం ప్రియులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కొత్త బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యం తీసుకురావొద్దని వారు వేడుకుంటున్నారు. అలాగే తమకు అలవాటైన ప్రముఖ కంపెనీలకు చెందిన మద్యాన్ని, బీర్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.