హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): గృహజ్యోతి పథకానికి అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేని వారికి తిరిగి అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్తు ప్లాంట్లల్లో ఏర్పడే సాంకేతిక సమస్యల ను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీని వేయాలని ఆదేశించారు.
2023 డిసెంబర్‌కు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నివేదించాలని సూచించారు. జల విద్యుత్తు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే అలసత్వం వహించొద్దని, వెంటనే తన దృష్టికి తేవాలని చెప్పారు. సమీక్షలో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని చిన్న వార్తలు
ఐపీఎస్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): దివంగత అడిషనల్ డీసీపీ మురళి కుమారుడు పీ పృథ్వీరాజ్‌కు ప్రభుత్వం నాయబ్ తహసీల్దార్‌గా ఉద్యోగం ఇచ్చింది. మురళి గతేడాది నవంబర్ 28న విధుల్లో ఉండగా మరణించారు. పోలీస్ శాఖ అభ్యర్థన మేరకు ఆయన కుమారుడికి నాయబ్ తహసీల్దార్ ఉద్యోగం ఇస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
18న సర్వాయి పాపన్న జయంతి
హైదరాబాద్, ఆగస్టు14 (నమస్తే తెలంగాణ):సర్దార్‌సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 18న జయంతి ఉత్సవాలు, ఏప్రిల్ 2న వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది.
సాగునీరు ఇవ్వాలని నిరసన
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరి మేజర్ కాల్వకు సాగునీటిని అందజేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్‌రెడ్డి బుధవారం రైతుల తో కలిసి కాల్వలో దిగి నిరసన తెలిపారు. 3 కిలోమీటర్ల వరకు చెత్తాచెదారంతో నిండిపోవటంతో నీరు రాని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
– హుజూర్నగర్
రెగ్యులర్ టీచర్లను వెంటనే కేటాయించాలి
రెగ్యులర్ టీచర్లను కేటాయించాలని కోరుతూ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రంగాపురం ప్రాథమిక పాఠశాల ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇద్దరు ఉపాధ్యాయులు పదోన్నతిపై వెళ్తే.. 20 రోజులుగా వేరే పాఠశాల నుంచి రోజుకో టీచర్‌ను పంపడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
– పాల్వంచ
జీతాలు లేక ఐదు నెలలుగా పస్తులే..
ఐదు నెలలుగా వేతనాలివ్వడం లేదని మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన అవుట్సోర్సింగ్ వైద్య సిబ్బంది కలెక్టర్‌ను కలిసి గోడువెల్లబోసుకున్నారు. జీతాలు రాకపోవడంతో పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దవాఖాన ఎదుట నిరసన తెలిపారు.
– మహబూబ్‌నగర్