హైదరాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ)ః తెలంగాణ కాంగ్రెస్‌ను నడిపిస్తున్నది ఎవరు? తెలంగాణ ప్రజలకు పెద్ద సందేహం వచ్చిపడింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడా? లేక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనా? అన్న అనుమానం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. రాఖీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేకంగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయనకు రాఖీ కట్టడం సంచలనమైంది. ఓ పక్క చంద్రబాబు అత్యంత అనుం గు అంతరంగికుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవడం.. సీతక్క లాంటి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు పాదాభివందనాలు చేయడం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వంపై సోషల్‌మీడియాలో ప్రశ్నలవర్షం కురుస్తున్నది. కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్న చంద్రబాబునాయుడి తొత్తులతో తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నదని సోషల్ మీడియాలో తెలంగాణ సమాజం విరుచుకుపడుతున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబుకు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టి బాబుకు పాదాభివందనం చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నడిపించేది ఎవరన్న ప్రశ్నలు నెటిజన్లు సంధిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై విషం చిమ్మిన చంద్రబాబే పరోక్షంగా కాంగ్రెస్‌ను శాసిస్తున్నారా అన్న విషయాన్ని ఆలోచించాలంటున్నారు. ఒక రేవంత్‌రెడ్డి, ఒక సీతక్కలాంటోళ్ళు పేరుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలే కానీ, వీరిని ఆడించే రిమోట్ ఆంధ్రలో ఉన్నదని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వాళ్లను నమ్మితే తెలంగాణను మరోసారి ఆంధ్రనేతలకు తాకట్టు పెడుతారని ధ్వజమెత్తారు. గతంలో తెలంగాణ నాయకులు కొందరు ఆంధ్ర నేతల కుక్క బిస్కట్లకు ఆశపడి మన రాష్ర్టాన్ని మనకు కాకుండా చేసారని ఆగ్రహిస్తున్నారు. కొట్లాడి తెచ్చుకొన్న రాష్ర్టాన్ని అస్థిరపరచాలని ఆంధ్ర నాయకులతో కలిసి కొందరు కుట్రలు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. రేవంత్, సీతక్క వంటి నాయకులు ఏ పార్టీలో ఉన్నా వారు పని చేసేది చంద్రబాబు వంటి ఆంధ్రబాబు ప్రయోజనాల కోసమేనని విమర్శిస్తున్నారు. ఆత్మగౌరవం, ఆస్తితం కోసం సాధించుకున్న తెలంగాణను గుంటనక్కల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉన్నదని నెటిజన్లు చెప్తున్నారు.