హైదరాబాద్ : పాతబస్తీ లోని ప్రముఖ దేవాలయం లాల్ దర్వాజ ఆలయ అభివృద్ధికి స్థానికులు భాగస్వాములు కావాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ విస్తరణ కోసం సేకరించాల్సిన స్థలాల యజమానులు, ఎమ్మెల్యే బలాల తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని అమ్మవారి ఆలయ అభివృద్ధి కి స్థానిక ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం ఆలయానికి ఆనుకొని ఉన్న కొన్ని నిర్మాణాలను సేకరిస్తున్నామని చెప్పారు. స్థలాలిచ్చే యజమానులకు ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 9 కోట్లను విడుదల చేసిందన్నారు.
ఇప్పటికే ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందుకు కమిటీ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్, సభ్యులు రాజ్ కుమార్, బద్రినాద్, జగదీశ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.