హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ట్రాన్స్జెండర్ల కోసం జిల్లాకో క్లినిక్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారానికి రెండు లేదా మూడురోజులపాటు వైద్యసేవలు అందించనున్నారు. జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అందుబాటులో ఉండనున్నారు. అవసరాన్ని బట్టి గైనకాలజిస్ట్, యూరాలజిస్ట్ ఇతర స్పెషలిస్టుల సేవలు అందించనున్నారు. జెండర్ మార్పిడి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించనున్నట్టు తెలిసింది.
ఉస్మానియా దవాఖానలోని ట్రాన్స్జెండర్ల క్లినిక్‌లో ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వైద్యారోగ్య, మహిళా సంక్షేమ శాఖలు సంయుక్తంగా వీటిని ఏర్పాటుచేయనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తాము అనారోగ్యం బారిన పడ్డప్పుడు దవాఖానలకు వెళ్లలేకపోతున్నామని, ధైర్యం చేసి వెళ్లినా అవమానాలు ఎదురోవాల్సి వస్తుందని ట్రాన్స్జెండర్లు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా క్లినిక్‌లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.