హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశంలో మతోన్మాద, కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు, వామపక్ష, ప్రజాస్వామిక సెక్యులర్ శక్తులు ఐక్య పోరాటాలు నిర్మించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అధ్యక్షతన కమ్యూనిస్టు కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జాతీయ సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమ్యూనిస్టు కో-ఆర్డినేషన్ కమిటీ జాతీయ కన్వీనర్లు మంగత్ రాం పాస్‌ల, మద్దికాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ.. 2014 నుంచి హిందుత్వ రాష్ట్రం ఏర్పాటు పేరుతో హిందుత్వంపైనే దాడి జరుగుతున్నదని వివరించారు. ప్రశ్నించే గొంతును పూర్తిగా అణచివేసేందుకు దేశంలో పాలకులు నిర్బంధ విధానాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
పీడిత ప్రజల ఐక్య పోరాటాల ద్వారానే ప్రజా వ్యతిరేక, నియంతృత్వ కార్పొరేట్ పాలనను తుదిముట్టించడం సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ-ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయ్‌కుమార్, మాస్‌లైన్ కేంద్ర కమిటీ సభ్యుడు కేజీ రాంచందర్ తదితరులు ప్రసంగించారు.