NAS | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలు, ప్రతిభను పరీక్షించేందుకు కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) పరీక్ష భయం రాష్ట్రప్రభుత్వాన్ని పీడిస్తుంది. మూడేండ్లకొకసారి ఈ సర్వేను కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కేజీబీవీలు, మాడల్ స్కూళ్లు అన్నింటిలోనూ 3, 6, 9 తరగతులకు న్యాస్ సర్వేను నిర్వహించనున్నారు. కాగా, గతంలో 2021లో విడుదల చేసిన న్యాస్ ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చదువులపై కరోనా ప్రభావం పడటంతో అప్పట్లో ఫలితాల్లో తెలంగాణ వెనుకబడింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు న్యాస్ ఫలితాలు, ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్(పీజీఐ)లను సాకుగా చూపిస్తూ విద్యలో తెలంగాణ 31వ స్థానంలో ఉందంటూ ఆరోపణలు గుప్పించింది.
ఈ ఏడాది సర్వేలో వెనుకబడితే అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుందన్న టెన్షన్ కాంగ్రెస్ సర్కారులో కనిపిస్తున్నది. ఏకంగా సీఎం రేవంత్రెడ్డియే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఫలితాల్లో వెనుకబడితే ఇబ్బందులు తప్పవన్న భావన సర్కారులో నెలకొన్నది. ప్రత్యేకంగా తయారుచేసిన న్యాస్ మాడల్ పేపర్లను విద్యార్థులకు అందించి ప్రాక్టీస్ చేయించే యోచనలో అధికారులు ఉన్నారు. దీని ద్వారా మెరుగైన గ్రేడ్ సాధించవచ్చని భావిస్తున్నారు. ఆగస్టు నెల రెండోవారం గడుస్తున్నా ఇంకా పాఠశాల విద్యాశాఖ బదిలీలు, పదోన్నతుల నుంచి బయటికిరాలేదు. నవంబర్ 19న న్యాస్ పరీక్ష ఉండటంతో దీని ప్రభావం సైతం పడుతుందని సర్కారు టెన్షన్పడుతున్నది.